ఫోన్ పే, గూగుల్ పే వంటి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) యాప్‌ల వినియోగంలో తెలంగాణ టాప్‌లో నిలిచింది. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో ఈ ఏడాది జులైలో చాలా ఎక్కువ సంఖ్యలో తలసరి యూపీఐ లావాదేవీలు జరిగాయి. రాష్ట్ర జనాభాలో ఒక్కో వ్యక్తి ప్రతినెలా సగటున 20.6 యూపీఐ లావాదేవీలను చేస్తున్నారు. దీన్ని బట్టి తెలంగాణలో యూపీఐ యాప్‌ల వినియోగం ఎంతగా పెరిగిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఇదే సమయంలో మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కో వ్యక్తి ప్రతినెలా సగటున 10 యూపీఐ లావాదేవీలను చేస్తున్నారు. తెలంగాణతో పోలిస్తే ఏపీలో గ్రామీణ ప్రాంతాలు ఎక్కువ. బహుశా ఆ కారణం వల్లే ఆంధ్రప్రదేశ్‌లో తలసరి యూపీఐ లావాదేవీలు అంత పెద్ద సంఖ్యలో లేవని పరిశీలకులు చెబుతున్నారు. గ్రామీణులు యూపీఐ లావాదేవీల కంటే నగదు లావాదేవీలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుండటం కూడా మరో కారణమై ఉండొచ్చు.
తలసరి యూపీఐ లావాదేవీల విషయంలో మనదేశంలో నంబర్ 1 స్థానంలో దేశ రాజధాని దిల్లీ ఉంది. అక్కడ ఒక్కో వ్యక్తి ప్రతినెలా సగటున 21.1 యూపీఐ లావాదేవీలు చేస్తున్నారు. అయితే దేశంలోని మొత్తం యూపీఐ లావాదేవీల్లో 2.4 శాతమే దిల్లీలో జరుగుతున్నాయి. ప్రతినెలా 20.6 తలసరి యూపీఐ లావాదేవీలతో నంబర్ 2 స్థానంలో తెలంగాణ ఉంది. మూడో స్థానంలో ఉన్న గోవాలో ప్రతినెలా 19.2 తలసరి యూపీఐ లావాదేవీలు జరుగుతున్నాయి. అయితే దేశపు యూపీఐ లావాదేవీల్లో దీని వాటా 0.2 శాతమే. దేశంలోనే అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో ప్రతినెలా జరుగుతున్న తలసరి యూపీఐ లావాదేవీల సంఖ్య 4.3 మాత్రమేనని తేలింది. దేశపు యూపీఐ లావాదేవీల్లో 5.3 శాతం అక్కడే జరుగుతున్నాయి. బిహార్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనూ తలసరి యూపీఐ లావాదేవీల సంఖ్య 5 కంటే తక్కువే ఉంది. దేశంలోని ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాల్లో నేటికీ నగదు లావాదేవీలే పెద్దసంఖ్యలో జరుగుతున్న తీరుకు ఈ గణాంకాలు అద్దంపడుతున్నాయి. అక్కడి నగరాలు, పట్టణాల్లో యూపీఐ లావాదేవీలు ఎక్కువగానే జరుగుతున్నప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లో నగదు లావాదేవీలపై ఎక్కువగా ఆధారపడుతున్నారు.
ఈ ఏడాది జులైలో మన దేశంలో జరిగిన యూపీఐ లావాదేవీల సంఖ్యను రాష్ట్రాల జనాభా ప్రాతిపదికన విభజించి చూడగా ఈ ఫలితాలు వచ్చాయి. జనాభాతో నిమిత్తం లేకుండా, కేవలం యూపీఐ లావాదేవీల సంఖ్యపరంగా చూస్తే మరోవిధమైన ర్యాంకింగ్స్ వచ్చాయి. జులై నెలలో మనదేశంలోనే అత్యధిక యూపీఐ లావాదేవీలు జరిగిన రాష్ట్రం మహారాష్ట్ర. నెల వ్యవధిలో భారత్‌లో జరిగిన మొత్తం యూపీఐ లావాదేవీల్లో 9.2 శాతం వాటా మహారాష్ట్రదే. అక్కడి ఒక్కో వ్యక్తి సగటున 14.8 లావాదేవీలు చేశాడు. భారతదేశ యూపీఐ లావాదేవీల్లో 5.8 శాతం వాటాను కర్ణాటక, 4.7 శాతం వాటాను తమిళనాడు అందించాయి.