తెలంగాణ రాష్ట్రానికి చైనా విద్యుత్తు కార్ల దిగ్గజసంస్థ BYD హైదరాబాద్ సమీపంలో విద్యుత్తు కార్ల యూనిట్ స్థాపించేందుకు సంప్రదింపులు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సంస్థ కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు సాగిస్తూ ఇటీవల తుదినిర్ణయాన్ని తెలియజేసినట్లు సంబంధిత వర్గాలు వివరించాయి. ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూమి కేటాయించడంతో పాటు, అన్నిరకాలుగా మద్దతు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఆ సంస్థకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ పరిసరాల్లో యూనిట్ ఏర్పాటుకు అనువైన మూడు ప్రదేశాలను BYD కి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ మూడింటినీ ఆ సంస్థ ప్రతినిధులు పరిశీలిస్తున్నారు. ప్రదేశంపై తుది నిర్ణయానికి రాగానే, ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉంది.
దీంతో పాటు విద్యుత్తు కార్ల విడిభాగాలు ఉత్పత్తి చేసే అనుబంధ యూనిట్లూ దీనికి సమీపంలో ఏర్పాటయ్యే అవకాశాలుంటాయి. తద్వారా విద్యుత్తు వాహనాల క్లస్టర్ హైదరాబాద్ సమీపంలో రూపుదిద్దుకున్నట్లు అవుతుంది. BYD కొన్నేళ్లుగా భారత్ లో కార్యకలాపాలు సాగిస్తున్నా, ఇక్కడ సొంత యూనిట్లు లేవు. ప్రస్తుతం BYD విద్యుత్తు కార్లను చైనా నుంచి మనదేశానికి తీసుకువచ్చి విక్రయిస్తోంది. ఇందుకోసం అధిక దిగుమతి సుంకాలు చెల్లించాల్సి రావడంతో, ప్రస్తుతం ఈ కార్ల ధర ఎక్కువగా ఉంది. ఫలితంగా ఆశించిన రీతిలో అమ్మకాలు చేయలేకపోతోంది. విద్యుత్తు కార్లను మనదేశంలో ఉత్పత్తి చేస్తే ధర తగ్గుతుంది. తద్వారా అమ్మకాలు గణనీయంగా పెంచుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది.
మనదేశంలో సొంత యూనిట్ ఏర్పాటు చేసేందుకు రెండేళ్లుగా BYD కసరత్తు చేస్తోంది. కాకపోతే చైనా పెట్టుబడులను అనుమతించే విషయంలో కేంద్ర ప్రభుత్వ నిబంధనలు కఠినంగా ఉండటంతో ఇప్పటివరకు సాధ్యం కాలేదు. తాజాగా కేంద్రప్రభుత్వం కొంత వెసులుబాటు కల్పించడంతో, BYD ప్రాజెక్టుకు మార్గం సుగమం అయినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ కేంద్రంగా విద్యుత్తు బస్సుల కార్యకలాపాలు సాగిస్తున్న MEIL గ్రూపు సంస్థ ఒలెక్ట్రాగ్రీన్ టేక్ తో ఎన్నో ఏళ్లుగా BYD కి సాంకేతిక భాగస్వామ్యం ఉంది. BYD టెక్నాలజీతోనే విద్యుత్తు బస్సులను ఉత్పత్తి చేసి, దేశవ్యాప్తంగా ఒలెక్ట్రాగ్రీన్ టెక్ సరఫరా చేస్తోంది. తన విద్యుత్తు కార్ల యూనిట్ ఏర్పాటుకు తెలంగాణ రాష్ట్రాన్ని BYD ఎంచుకోడానికి ఇదీ ఒక కారణమని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.