వ్యక్తిగత ఆస్తిలో అత్యంత ముఖ్యమైనది స్వంత ఇల్లు. నిజానికి స్వంత ఇల్లు అనేది కేవలం ఒక ఆస్తి కాదు, అదో పెద్ద సెంటిమెంట్ మనిషికి. ఎందుకంటే తన కుటుంబం అందులోనే నివసిస్తుంది కాబట్టి. భారతీయులు కుటుంబానికి, ఇంటికి తేడా చూడరు. ఇల్లు అంటే కుటుంబమనేంత భావోద్వేగ బంధం ఆ వ్యక్తిగత ఆస్తితో పెంచుకుంటారు. మన సమాజంలో ఇల్లు అంటూ వుంటే జీవితానికో భద్రత కలిగినట్లే అనే ధీమా కూడా ఏర్పడుతుంది. వారసత్వంగా స్వంత ఇల్లు సంక్రమించని అందరికీ అది ఏర్పరుచుకోవడం ఓ పెద్ద కలే. స్వంత ఇంటి కల అనేది సమాజంలో అన్ని వర్గాలకు చెందిన ప్రజల్లో వుండేదే. మొత్తంగా ఇంటి చుట్టూ బోలెడన్నీ కలలు, అభిరుచులు, ఆశయాలు, భావోద్వేగాలు మనిషి జీవితంలో ముఖ్య పాత్ర వహిస్తాయి. సంపన్నులు ఎలాగైనా స్వంత ఇంటిని ఏర్పాటు చేసుకోగలరు. మరీ మాట్లాడితే ఒకటికి మించి ఇళ్లను ఏర్పరుచుకోగలరు ఆ వర్గం వారు. ఎటొచ్చీ మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి వారికే అదో పెద్ద కల. ఇంక అల్పాదాయ వర్గాల వారికి అదో అందని ద్రాక్ష పండే. వారు స్వంత ఇంటి కోసం కేవలం ప్రభుత్వ పథకాల మీద ఆధారపడాల్సిందే.
“3 బి హెచ్ కె” సినిమా కథ స్వంత ఇంటి కోసం ఓ దిగువ మధ్యతరగతి చేసిన ఆశ నిరాశల ప్రయాణం. తల్లీ, తండ్రీ, కొడుకు, కూతురు… నలుగురు కుటుంబ సభ్యులు స్వంత ఇల్లు ఏర్పరుచుకోవాలన్న సింగిల్ పాయింట్ అజెండాగా సాగిన కథ ఇది. ఎంతో నిజాయితీ, క్రమశిక్షణతో ప్రణాళికలు రూపొందించి, డబ్బులు కూడబెట్టినా ప్రతిసారీ పిల్లల చదువులు, అనారోగ్యాలు, ఆడపిల్ల పెళ్లి వంటి కారణాలతో స్వంత ఇల్లు వాయిదా పడుతూనే వుంటుంది. దానితో ఇంటి పెద్ద, ఓ ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్ గా పనిచేసే వాసుదేవన్ స్వంత ఇంటి కలని తన కొడుకైనా తీర్చగలడని ఆశలు పెట్టుకుంటాడు. నిజానికి కొడుకు కంటే కూతురే తెలివైనది. కానీ స్వంత ఇంటి కలని నెరవేర్చేది కొడుకు కాబట్టి కూతురుని మామూలు కాలేజిలో చదివించి, అబ్బాయిని మంచి, ప్రైవేట్ కాలేజిలో జాయిన్ చేస్తాడు. ఏ రకంగా చూసినా యావరేజ్ పెర్ఫార్మర్ ఐన కొడుకు విద్య, ఉద్యోగం విషయాల్లో తన తల్లిదండ్రుల్ని నిరాశ పరుస్తూనే వుంటాడు.
“ఇల్లు అంటే మనిషికి సమాజంలో ఓ గౌరవ స్థానం” అని నమ్మిన వాసుదేవన్ రుద్దిన కలల భారం అతని కొడుకు ప్రభు మీద తీవ్రమైన వత్తిడిని పెంచుతాయి. ప్రభు 34 ఏళ్లొచ్చినా జీవితంలో స్థిరపడలేకపోతాడు. సినిమాకి ఈ ఘర్షణే కీలకం. అలా ఎందుకు బలహీనంగా మిగిలిపోతాడంటే చదువు, కెరీర్ విషయంలో కొడుక్కి ఏది ఇష్టమో, అతని మనస్తత్వానికి ఏది సౌకర్యమో అది కాక అతని భవిష్యత్తుకి ఏది మంచిది అని భావిస్తాడో అటువైపు డ్రైవ్ చేస్తుంటాడు ఆ తండ్రి. చివరికి ఆ కొడుకు తండ్రి కలని నెరవేర్చాడా లేదా, ఒకవేళ అతను సాధిస్తే తన మైండ్ సెట్ లో ఎలాంటి మార్పులు చేసుకున్నాడు అనేది తరువాతి కథ.
అభద్రతా భావాలతో జీవితంలో సర్దుకుపోవడం కాలం సాధించగలిగేది ఏదీ వుండదని, చచ్చేంతవరకూ ఎలాగోలా బతకడమే మిగులుతుందని, అవసరమైన సందర్భాలలో బోల్డ్ గా మనసు చెప్పినట్లు నిర్ణయాలు తీసుకోవాలని, సౌకర్యంగా వున్న వాతావరణంలోనే వ్యక్తి ఆత్మవిశ్వాసం ఇనుమడించి, లక్ష్యాన్ని చేరుకోగలుగుతాడని ఈ సినిమా పరోక్షంగా ఇచ్చే సందేశం.
ఎంత ప్రేమ వున్నా, ఎన్ని త్యాగాలకు సిద్ధపడ్డా మన మధ్యతరగతి కుటుంబ వ్యవస్థలోని పెద్దలు జెండర్ వివక్షల్ని, ఆధిపత్య భావనల్ని తమ మానవ సంబంధాలలో అత్యంత సహజ అంతర్భాగంగానే చూస్తారనే విషయాన్ని చాలా ప్రభావవంతంగా చూపించాడు దర్శకుడు. ఈ సంక్లిష్టమైన విషయాన్ని గమనంలోకి తీసుకోకపోతే ఇది టీవీ సీరియల్ కి ఎక్కువగానూ, సినిమాకి తక్కువగానూ ప్రేక్షకుడు భావించే అవకాశం లేకపోలేదు.
ఇందులో సిద్ధార్థ్, శరత్ కుమార్, దేవయాని వంటి పాపులర్ కమర్షియల్ నటులు నటించినప్పటికీ ఇదో ఫార్ములా సినిమా కాదు. హీరోయిజం, ఫైట్స్, డ్యూయెట్స్, మసాలా డైలాగులు, భారీ సెట్టింగ్స్ లేకుండా సహజ వాతావరణంలో సహజ భావోద్వేగాలతో నిండిన సినిమా. ఇలాంటి సింగిల్ పాయింట్ మీద నిర్మితమయ్యే కథలన్నీ ప్రేక్షకుల ఊహలకు అనుగుణంగానే సాగుతాయి. ఈ సినిమా కూడా అందుకు మినహాయింపు కాదు. ఈ పరిమితిని అర్థం చేసుకోగలిగితే మనం వాసుదేవన్ కుటుంబంతో సినిమాలో చూపించిన పాతికేళ్ల ప్రయాణం చేస్తాం.
వాసుదేవన్ గా శరత్ కుమార్, ఆయన కొడుకు ప్రభుగా సిద్ధార్థ్ తమ రోల్స్ కి పూర్తి న్యాయం చేశారు. ఎక్కడా వాళ్లిద్దరూ కనబడకుండా కేవలం ఆ పాత్రలే కనబడేంత బాగా చేశారు. వాసుదేవన్ కూతురు ఆర్తిగా మీతా రఘునాథ్ కూడా గుర్తుండిపోయేలా చేసింది. ఐతే ఆమె పాత్రకి దర్శకుడు పూర్తి న్యాయం చేయలేదు. ఆమె గృహ హింస మీద తిరుగుబాటు చేసి, విడాకులు తీసుకొని, తన కాళ్ల మీద తాను నిలబడి బిడ్డని పోషించుకునేంత వరకే చూపించాడు దర్శకుడు. మూసగా బతకడం నుండి బోల్డ్ గా నిర్ణయాలు తీసుకొని, జీవిత లక్ష్యాన్ని సాధించేలా అన్న పాత్రకి చేసిన న్యాయం చెల్లెలు విషయంలో చేయలేదు దర్శకుడు. మళ్లీ పెళ్లి చేసుకొని పూర్తిగా రీలొకేట్ అయినట్లుగా ఆమెని కూడా చూపించి వుంటే బాగుండేది. ఇది మరీ రాడికల్ అనుకున్నాడేమో దర్శకుడు.
కొంచెం ఓపికగా చూడండి. కథ ముందుకి వెళుతున్న కొద్దీ చిక్కబడుతుంటుంది. ఫార్ములా సినిమాల్ని వ్యతిరేకించే వాళ్లు చూడదగ్గ సినిమా.
***
సినిమా కథకి ప్రత్యక్ష సంబంధం లేదు కానీ స్వంత ఇంటి రూపంలో వుండే స్వంత ఆస్తి గురించి ఒక విషయం చెప్పుకోవాలి. భారతదేశ జనాభాకి సరిపోయేంత హౌసింగ్ (రెంటెడ్ + ఓన్) అసాధ్యం కాకపోవచ్చేమో కానీ అందరికీ స్వంత ఇల్లు మాత్రం సాధ్యం కాదు. ఎందుకంటే మన దేశంలో ఇళ్లు, నివాస స్థలాలు సంపాదించుకోవడం మీద ఎలాంటి పరిమితులు లేవు. దానితో ఒక్కొక్కరు తమ కుటుంబ అవసరాలకు మించి ఆస్తులు సమకూర్చుకుంటారు. ఇల్లు, స్థలం అనేవి సమాజంలో నివసించే అందరికీ తప్పనిసరి అవసరంగా కాక అదో ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ గా వ్యక్తుల్ని ప్రోద్భలపరిచే మార్కెట్ ఎకానమీ రేట్లని విపరీతంగా పెంచేసి స్వంత ఇల్లు అనేది ఓ కల స్థాయికి తీసుకెళుతుంది. ఫలితంగా అది కొందరికే పరిమితమవుతుంది. స్వంత ఇంటి కోసం మనం మిగతా కలల్ని త్యాగం చేయాల్సి వస్తుంది.
ఏదోమేరకి సొషలిస్టు వ్యవస్థలుగా వున్న వియత్నాం, చైనా వంటి దేశాల్లో ఇళ్లు, భూమి వంటి వ్యక్తిగత ఆస్తుల మీద పరిమితులుంటాయి. అక్కడ ఎంత మార్కెట్ ఎకానమీ వున్నా రెండో ఇంటి మీద ఆంక్షలు వుంటాయి. అందువల్ల అలాంటి వ్యవస్థల్లో స్వంత ఇల్లు పెద్ద కల కాకపోవచ్చు. కానీ ఇక్కడి కేపిటలిస్ట్ వ్యవస్థలో మధ్యతరగతి వాళ్లందరం రియల్ ఎస్టేట్ సాలెగూడులో శలభాలమే.
అరణ్యకృష్ణ


