నటి స్వరా భాస్కర్ తన వ్యాఖ్యలపై వచ్చిన ట్రోల్స్‌కు సమాధానంగా దేశంలోని నిజమైన సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. జులైలో ఒక ఇంటర్వ్యూలో, మనుషులందరూ స్వతహాగా బైసెక్సువల్స్ అని చెప్పిన స్వరా, సమాజవాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్ పై తనకు క్రష్ ఉందని ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. ఈ వ్యాఖ్యలు ఉన్న వీడియో క్లిప్ ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఇలా మాట్లాడడం సరికాదని ఆమెపై విమర్శలు వచ్చాయి.
ఈ విషయంపై జాతీయ మీడియాతో మాట్లాడిన స్వరా, “ఆ ఇంటర్వ్యూలో నేను బైసెక్సువల్ గురించి నా అభిప్రాయాన్ని చెప్పాను. అది ఎందుకు వైరల్ అయిందో నాకు అర్థం కావడం లేదు. నేను తప్పుగా ఏమీ మాట్లాడలేదు. నా ఆలోచనను చెప్పాను. అది ప్రాక్టికల్‌గా జరుగుతుందని కాదు. నాకు పెళ్లి అయింది, ఒక కుమార్తె కూడా ఉంది. డింపుల్ విషయానికి వస్తే, ఆమె అందంగా ఉంటారు, చాలామందికి స్ఫూర్తిదాయకం. ఆమె రాజకీయ నాయకుడు (అఖిలేశ్ యాదవ్) భార్య. రాజకీయాల్లో ఆమెకు తనదైన గుర్తింపు ఉంది. నేను ఆమెను ఎల్లప్పుడూ ఆరాధిస్తాను. ఆ సందర్భంలోనే ఆ విధంగా మాట్లాడాను” అని వివరించారు.
డింపుల్‌తో ఈ వివాదం గురించి మాట్లాడారా అని అడిగిన ప్రశ్నకు, “లేదు, మాట్లాడలేదు. అయినా ఇది పెద్ద విషయం కాదు. డింపుల్, ఆమె కుటుంబం పరిణతి గలవారు, వారు ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారని నేను భావిస్తున్నాను” అని స్వరా సమాధానమిచ్చారు.
ఇదిలా ఉండగా, స్వరా భాస్కర్ గతంలో ‘ఛావా’ చిత్రం గురించి చేసిన వ్యాఖ్యలపై కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. అలాగే, ఈ ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా ఆమె చేసిన ఒక ఎక్స్ పోస్ట్ కారణంగా ఆమె ఎక్స్ ఖాతా తాత్కాలికంగా సస్పెండ్ కావడం కూడా గమనార్హం.