తెలుగులో కోర్ట్ డ్రామా సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. అలా వచ్చిన సినిమానే “కోర్ట్”. ఇది ప్రముఖ నటుడు నాని సమర్పణలో వచ్చిన సినిమా. చట్టాల గురించి అవగాహన కలిగివుండటానికి ప్రేరేపించేలా ఉన్న సినిమాగా ఈ సినిమాకి మంచి పాజిటీవ్ టాక్ వచ్చింది. తీరా సినిమా చూస్తే మంచిచట్టాల స్ఫూర్తిని దెబ్బతీసేలా వుంది అని చెప్పక తప్పదు.
బాధితుల పక్షాన నిలిచి వారికి న్యాయం చేసే చట్టాలు ఎక్కడో ఓ చోట దుర్వినియోగం కావచ్చు, ఆ కొద్దిపాటి దుర్వినియోగాన్ని చూపించి అసలు ఆ చట్టాల స్ఫూర్తి మీదనే దాడిచేయడం ఈ మధ్య ఓ ట్రెండ్ గా మారింది. దీని ఉదాహరణగా ఎస్.సి./ఎస్.టి. అత్యాచార నిరోధక చట్టం, గృహహింసా నిరోధకచట్టం, చిన్నపిల్లల మీద లైంగిక దాడులను దృష్టిలో పెట్టుకొని తీసుకొచ్చిన పోక్సో చట్టం (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ అఫెన్సెస్ చట్టం, 2012) వంటి వాటిని ఉదహరించొచ్చు. ఈ సినిమాని ఆ ట్రెండ్ లో భాగంగానే చూడాలి.
పోక్సో చట్టం కేంద్రంగా ఈ సినిమా కథ సాగుతుంది. సహజసిద్ధంగా వయసు ప్రభావం రీత్యా, హార్మోన్ల ప్రభావం రీత్యా సంభవించే టీనేజ్ ప్రేమలు, వారిమధ్య ఏర్పడే కాముక ఆకర్షణలు, లైంగికచర్యలు పోక్సో చట్టపరిధిలోకి రావడాన్ని తప్పుపట్టే విధంగా తీసిన సినిమా ఇది. అయితే పోక్సో ఉద్దేశ్యం టీనేజ్ లవ్స్ ని తప్పుపట్టి అలా ఆకర్షణలకుగురైన వారిని శిక్షించడంకాదనే స్పృహతోనే ఈ సినిమా చూడాల్సి వుంటుంది. లేకపోతే వేగంగా వచ్చిపడే ప్రభావవంతమైన సన్నివేశాల వెల్లువలో ప్రేక్షకుడు కొట్టుకుపోయే ప్రమాదముంది. ఎన్నో లూజ్ ఎండ్స్, తప్పుల తడకలు, సాంకేతికంగా కోర్ట్ నడిచే తీరుపట్ల అవగాహన లేమి అన్నీ కనిపిస్తాయి ఈ సినిమాలో. ఇందులో డ్రామా తప్పిస్తే నిజమైన కోర్ట్ స్వభావంతో కోర్ట్ సీన్స్ వుండవు. ఈ సినిమాలో ఓ అందమైన ప్రేమకథ, మంచి నేరేషన్, నటుల అమోఘమైన పెర్ఫార్మెన్స్, సహజ వాతావరణం అన్నీ వున్నాయి.. వాస్తవాలు, సత్యం, న్యాయం తప్ప!
అసలు కథే ఎన్నో లూజ్ ఎండ్స్ తో రాసుకున్నారు. ఒక 17 సంవత్సరాల 267 రోజుల మైనర్ బాలికతో ఒక 19 ఏళ్ల కుర్రాడు ఒక గదిలోకి వెళ్లి తలుపేసుకున్నంతమాత్రాన సెక్స్ జరిగినట్లుగా ఏ చట్టమూ భావించదు. చివరికి పోక్సో చట్టంలో కూడా అటువంటి వివరణ లేదు. ఈ సినిమాలో మాత్రం అదే కీలకం. అదేమిటో డిఫెన్స్ లాయర్ కూడా నిందితుడు బాధితురాలితో కలిసి గదిలోకి వెళ్లగానే డిఫెన్స్ లాయర్ కూడా అసహ్యించుకుంటాడు. తాత్కాలికంగా కేసుని వదిలేస్తాడు. చాలా సిల్లీగా వుంటుంది.
మెడికల్ ఎగ్జామినేషన్ జరక్కుండా, బాధితురాలి నుండి పోలీసులు స్టేట్మెంట్ తీసుకోకుండా అసలు చార్జ్ షీట్ రూపొందించబడదు. ఈ సినిమాలో మాత్రం అలాగే జరుగుతుంది. అంతేకాదు, కేసు కూడా నడుస్తుంది. ఇంక శిక్షపడటమే తరువాయి అన్నట్లుగా వుంటుంది. ఎంత హాస్యాస్పదంగా అనిపిస్తుందో, చట్టం గురించి కోర్ట్ ప్రొసీడింగ్స్ గురించి ఐడియా ఉన్నవాళ్ళకి ! బాధితురాలుని అసలు జడ్జి చూడకుండానే తీర్పుకి సిద్ధమైపోతాడు. దానికి ఏదో కారణం చెబుతారు బాధితురాలు మెంటల్లీ డిస్టర్బ్డ్ గా వుందని. కోర్టులో అలాంటి వ్యవహారాలు ఏవీ అనుమతించబడవు. సాక్షులు చనిపోయినా, కోర్టుకి రాకపోయినా నిందితుడికి అడ్వాంటేజ్ వుంటుంది. డైరెక్టర్ తన ఇష్టం వచ్చినట్లు కోర్ట్ నిర్వహించే తీరుని, చట్టాల్ని వాడేసుకున్నాడు. అతని దృష్టి మొత్తం ప్రేక్షకుల్ని రంజింపచేయటం మీదనే వుంది కానీ తాను వాస్తవాల్ని చెబుతున్నానా లేదా అనే దానిమీద లేదు. సినిమాటిక్ లిబర్టీలో కొన్ని అసంగతాలు వుండొచ్చేమో కానీ వక్రీకరణలు వుండకూడదు. చట్టాల గురించి అవగాహనకల్పించే మాటేమో కానీ ఈ సినిమా కోర్ట్ ప్రొసీడింగ్స్ కి సంబంధించి ప్రేక్షకుల్ని తప్పుదోవ పట్టించే విధంగా వున్నది. కోర్ట్ నిర్వహించబడే తీరులోనే చట్టాల స్ఫూర్తిని కాపాడటం ప్రధానంగా వుంటుంది. ఊర్లలో పెదరాయుడి తీర్పుల్లా కోర్టులు పనిచేయవు.
సినిమాలో మొదటి ట్రయల్ లో అదేమిటో జడ్జిగారు నిందితుడితో కూడా అసలు మాట్లాడడు. నిజానికి ఏ చిన్న నేరానికి సంబంధించిన కేసులో అయినా జడ్జి నిందితుడిని కొన్ని ప్రశ్నలు వేస్తాడు. అయితే అవి క్లారిఫికేషన్ తీసుకునే రీతిలోనే వుంటాయి, కానీ క్రాస్ ఎగ్జామిన్ చేస్తున్నట్లుగా వుండవు. జడ్జి అడిగినప్పుడు నిందితుడు తన నిర్దోషిత్వం గురించి చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో జడ్జిమెంటుకి ముందు ఆ ప్రసక్తే వుండదు. ఒకవేళ జడ్జిగారి ప్రశ్నలకు సమాధానం ఇవ్వటం ఇష్టంలేకపోతే నిందితుడు సైలెంట్ గా వుండొచ్చు, లేదా తనని తాను తన తరపున ఒక విట్నెస్ గా ఆఫర్ చేసుకోవచ్చు. విట్నెస్ గా ఆఫర్ చేసుకుంటే మాత్రం పిపి క్రాస్ ఎగ్జామిన్ చేయొచ్చు. కోర్ట్ ప్రొసీడింగ్స్ గురించి కనీస పరిజ్ఞానం వుంటే ఆ సన్నివేశం వుండి వుండేది.
కొత్త డిఫెన్స్ లాయర్ రాగానే అప్పటివరకు జరిగిన కోర్ట్ విచారణని మళ్లీ రీకాల్ చేస్తారు సినిమాలో. ఇది అసాధ్యం. అసహజం కూడా! అలా చేసే అధికారం కోర్టుకి కూడా లేదు. కేవలం హైకోర్ట్ అలాంటి ఉత్తరువులు ఇవ్వగలదు.
ఇలా చెప్పుకుంటూ పోతుంటే విట్నెసెస్ ని పరీక్షించడం, ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ (గోప్యంగా కోర్టు విచారణ) నిర్వహించడం వంటి ఎన్నో విషయాల్లో సినిమాటిక్ లిబర్టీ పేరుతో ఎన్నో తప్పుల తడకలు సినిమా మొత్తం వున్నాయి. అన్నింటికంటే అభ్యంతరకరమైనది అసలు కొన్ని ఫేక్ ఎమోషన్స్ క్రియేట్ చేయడం ద్వారా పోక్సో చట్టం స్ఫూర్తినే దెబ్బతీయాలని చూడటం. బాధిత వర్గాలపట్ల పాజిటీవ్ డిస్క్రిమినేషన్ చూపించే చట్టాలు దుర్వినియోగం అవుతున్నాయని మెల్లగా గొణగటంతో మొదలుపెట్టి, అసలు ఆ చట్టాల వల్ల శిక్ష పొందేవారందరూ అమాయకులే అన్నంత వరకు ఈ వాదనలు వెళతాయి. మొన్నామధ్య బెంగుళూరులో సుభాష్ అనే టెకీ ఇలాగే ఆత్మహత్య చేసుకునేముందు గృహహింసా నిరోధకచట్టం తన విషయంలో ఎలా దుర్వినియోగం అయిందో వీడియో చేసిమరీ చనిపోయినప్పుడు ఆ చట్టంమీద తీవ్ర వ్యతిరేకత వచ్చింది. సాంఘిక, లింగ వివక్షలతో కూడిన ఇంతటి నిచ్చెనమెట్ల వ్యవస్థలో పోక్సో, గృహహింస నిరోధక చట్టం, ఎస్.సి/ఎస్.టి. అట్రాసిటీస్ నిరోధకచట్టం వంటి చట్టభయాలు లేకపోతే ఈ సమాజం ఇంకెంత హింసాత్మకంగా వుంటుందో ఆలోచించాలి.
ఒక సినిమాగా “కోర్ట్” ప్రేక్షకుల్ని అలరించవచ్చేమో కానీ, మనం అప్రమత్తంగా వుండాల్సిన అవసరం వుంది. శివాజి, ప్రియదర్శి, రోహిణి, హర్ష రోషన్, శ్రీదేవి, హర్షవర్ధన్, సాయికుమార్ తమ పాత్రలకి అద్భుతంగా న్యాయం చేశారు. ముఖ్యంగా శివాజి నటన మరో లెవెల్లో వుంది. కారక్టరైజేషన్స్ ఈ సినిమాకి బలం. ఏ పాత్రా వృధాగా కనిపించదు. దర్శకుడు రాం జగదీష్ మొదటి సినిమా అయినా చాలా ఆత్మవిశ్వాసంతో సినిమా తీశారు. ఎటొచ్చీ సబ్జెక్టుకే న్యాయం చేయలేదాయన. అందువల్లే కొంత అప్రమత్తతతో చూడాల్సిన సినిమా ఇది.
సినిమా నడుస్తున్నంతసేపూ ఒక మిశ్రమానుభూతితో చూస్తాము. ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ కి సంభ్రమానికి గురవుతూ కథని నడిపిస్తున్న తీరుకి విసుక్కుంటూ సినిమా చూడాల్సి వస్తుంది.
~ అరణ్య కృష్ణ
1 Comment
మీరు చెప్పిన కోణంలో ప్రజలు అలోచించకుండా తీసుకెళ్లడంలో దర్శకుడు కృతార్థుడయ్యడు
మంచి analysation sir 👍