అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై 25% సుంకాలు విధిస్తామని హెచ్చరించిన నేపథ్యంలో, భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ రష్యా పర్యటనకు వెళ్లారు.
ఈ పర్యటన ముందుగానే నిర్ణయించినప్పటికీ, ట్రంప్ హెచ్చరికల కారణంగా ఇది చర్చనీయాంశంగా మారింది. డోభాల్ ఈ సందర్భంగా రష్యాతో రక్షణ, ఇంధన సంబంధాలను బలోపేతం చేయడంపై దృష్టి సారించనున్నారు. రష్యా నుంచి చమురు సరఫరా, ఎస్-400 క్షిపణి వ్యవస్థలు, ఎస్‌యూ-57 యుద్ధ విమానాల కొనుగోలు వంటి కీలక అంశాలపై మాస్కో అధికారులతో చర్చలు జరిపే అవకాశం ఉంది.
రష్యా ప్రభుత్వం భారత్‌కు మద్దతు ప్రకటించి, సార్వభౌమ దేశాలు తమ వాణిజ్య భాగస్వాములను ఎన్నుకునే హక్కు ఉందని పేర్కొంది. ఈ నెలాఖరులో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కూడా రష్యా పర్యటనకు వెళ్లనున్నారని సమాచారం.


