వ్యక్తుల పేరు మీద ఇచ్చే అవార్డ్స్ ఒక్కరికి ఇస్తారు. దాదా సాహెబ్ పాల్కే అవార్డు, రఘుపతి వెంకయ్య అవార్డు, ఎన్టీర్ అవార్డు ఇలా వాళ్ళ పేరు మీద అవార్డ్స్ ఇస్తారు. గద్దర్ పేరు మీద సినిమా రంగంలోని అందరికి అవార్డ్స్ ఇవ్వడం వింతగా ఉంది. ఈ విషయం ప్రకటించినప్పుడు కూడా రాశాను. సినిమా రంగానికి గద్దర్ చేసిన సేవ ఏంటి? సినిమారంగంలో ఆయన ప్రయాణం ఎంత? సినిమారంగానికి అయన కాంట్రిబ్యూషన్ ఏంటి అని అడిగితె చాల చాలా తక్కువ. మరి ఎందుకు అయన పేరు పెట్టారు అంటే ఆ విషయం ఆ బ్రహ్మదేవుడికి ఎరుక.
గద్దర్ మొత్తం జీవితంలో మెజారిటీ జీవితంలో అయన దేన్నీ నమ్మాడు, ఏ సిద్ధాంతానికి పని చేశాడు, ఏం రాశాడు, ఏం పాడాడు అనే కనీస అవగాహన లేదు అనుకోవాలా? సినిమా రంగం మొత్తం పెట్టుబడి దారి వ్యవస్థకు సంబంధించింది. గద్దర్ భావజాలం దీనికి పూర్తిగా వ్యతిరేఖం కదా. అలాంటప్పుడు ఆయనపేరు మీద ఈ పరిశ్రమకు అవార్డ్స్ ఇవ్వడం అనేది ఆయనను గొప్పవాడిని చేస్తుందా?
గద్దర్ మీద ప్రేమ ఉంటె ఆయన పేరు మీద ఓ కోటి రూపాయలు ఓ అవార్డు ను పెట్టి ఉత్తమ సామాజిక స్పృహ ఉన్న సినిమాకు లేదా సమాజం గురించి నటించిన ఓ నటుడికి ఇచ్చే విధంగా ఏర్పాటు చేయాలి. అప్పుడు కదా అతని భావజాలానికి అతడు జీవించిన జీవితానికి గౌరవం ఇచ్చినట్లు. వ్యక్తుల పేరు మీద ఇన్ని అవార్డ్స్ ఇవ్వడం తెలంగాణ ఏ మొదటి సారి అవుతుందేమో.
ఆస్కార్ అవార్డు అయినా, ఫిలిం ఫేర్ అవార్డు అయినా, నంది అవార్డు అయినా ఇవన్నీ ఆయా సినిమా రంగానికి సంబంధించి వివిధ కేటగిరీల్లో ఇస్తారు. ఇలా వ్యక్తుల పేర్లు పెట్టరు. ఆయన భావజాలం అయన సిద్ధాంతాలు సమాజం లోని కొంతమందికే నచ్చుతాయి. ఇప్పుడు ఆయన పేరు పెట్టి అందర్నీ బలవంతంగా ఒప్పించడం అనే దాన్ని ఎలా చూడాలి? అవార్డ్స్ వచ్చిన వాళ్ళు మనస్ఫూర్తిగా వాటి గురించి మాట్లాడుతారా? పైకి మొహమాటం కోసం నాలుగు మాటలు చెబుతారు.
అధికారం ఇచ్చారు కదా అని ఇష్ట మొచ్చిన నిర్ణయాలు తీసుకొని ప్రజల మీద రుద్దడం అనేది పాలకులకు అలవాటు అయిన విషయం. ఇది ఇప్పుడు మొదలు కాలేదు ఇప్పుడే అంతం కూడా కాదు.