ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా బడిబాట కార్యక్రమాన్ని చేపడుతున్నా చేరికకు విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు. శంకర్పల్లి మండలం ఇరుకుంట తండా ప్రాథమిక పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు మాత్రమే ఉన్నారు. పిల్లలు ఎవరూ లేరు. ఈ పాఠశాలకు గతేడాది ఒక ఉపాధ్యాయుడు విధుల్లో చేరగా.. అతనికి వేరే ఉద్యోగం రావడంతో వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. ఈ విద్యా సంవత్సరంలో మహారాజ్ పేట పాఠశాల నుంచి ఇద్దరు ఉపాధ్యాయులను డిప్యూటేషన్ పై ఏర్పాటు చేసినా పిల్లలు ఎవరు చేరలేదు. పాఠశాల ప్రారంభమైన 12న నలుగురు విద్యార్థులకు ఉపాధ్యాయులు పాఠ్యపుస్తకాలు నోటు పుస్తకాలు, ఏకరూప దుస్తులు పంపిణీ చేసినప్పటికీ వారు సైతం ఇక్కడికి రాకుండా దొంతనపల్లి, మహారాజపేట్ పాఠశాలలకు వెళ్లినట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు. 20 ఏండ్ల నుంచి ఈ పాఠశాలకు ఉపాధ్యాయులు సక్రమంగా వెళ్లకపోవడం డిప్యూటేషన్‌పై ఉపాధ్యాయులను నియమించడం రద్దు చేయడంతో ప్రభుత్వ పాఠశాలపై తల్లిదండ్రులకు నమ్మకం సన్నగిల్లినట్లు తెలుస్తోంది.
పాఠశాల సక్రమంగా నడుస్తుందన్న నమ్మకం లేకపోవడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను పక్క గ్రామాలకు ఆటోల్లో పంపిస్తున్నారు. ఇటీవల బడిబాట ప్రారంభమైన రోజు మూతపడిన ఇరుకుంట తండా పాఠశాల అనే శీర్షికతో కథనం ప్రచురించగా ఇద్దరు ఉపాధ్యాయులను నియమించారు. బడిబాట సైతం నిర్వహించారు. నలుగురు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు నోటు పుస్తకాలు ఏకరూప దుస్తులు కూడా పంపిణీ చేసినట్లు సీఆర్పీ దస్తప్ప తెలిపారు. విద్యార్థులు ఎవరూ రాలేదని వారంతా ప్రైవేట్ పాఠశాలలకు వెళ్తున్నారని, పక్కనే ఉన్న మరో గ్రామంలోని పాఠశాలకు వెళ్తున్నారని చెప్పుకొచ్చారు. ఈ విషయమై ఇన్ చార్జి ఎంఈవో సయ్యద్ అక్బరు వివరణ కోరగా ఇరుకుంట తండా పాఠశాలకు డిప్యూటేషన్‌పై ఉపాధ్యాయులను నియమించామని పిల్లలు రావడంలేదని స్పష్టం చేశారు. మరొకసారి గ్రామంలో తల్లిదండ్రులతో సమావేశమై పాఠశాలల్లో చేర్పించాలని కోరన్నట్లు తెలిపారు.
ఇరుకుంట తండా ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులను చేర్పించాలని ఇంటింటికి తిరుగుతున్నాం. పంపిస్తాం అంటున్నారు పంపడం లేదు. 12వ తేదీన హాజరైన ముగ్గురిలో ఒక పిల్లవాడి అక్క ఆరవ తరగతి ఉండడంతో వేరే స్కూల్లో జాయిన్ అయ్యారని చెప్పారు. ఇంకా కొంతమంది ఇళ్లకు తాళాలు ఉంటున్నాయి. మరికొందరు పంపిస్తాం అంటున్నారు పంపించడం లేదు. మేము ఇక్కడ పర్మినెంట్ ఉపాధ్యాయులను కాము… ఆన్ డ్యూటీ లో పంపిస్తే వచ్చాం.. మహారాజుపేటలో నలుగురు ఉపాధ్యాయులకు గాను అక్కడ కూడా ఇద్దరే ఉన్నారు. మా ఇద్దరినీ ఇక్కడికి పంపించారు. మీరు పాఠశాలకు వచ్చే సమయంలో కూడా మేము తల్లిదండ్రులై ఇండ్లకు వెళ్లి వస్తున్నాం.. ఇంతకన్నా మేము ఎక్కువ ఏం చేయలేము కదా అంటున్నారు.