నేషనల్ హెరాల్డ్ కేసులో మంగళవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) తన ఛార్జ్‌షీట్‌లో కాంగ్రెస్ ఎంపీలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ పేర్లతోపాటు ఆ పార్టీ విదేశీ విభాగం చీఫ్ Sam Pitroda పేరును చేర్చింది. అయితే ఈ ఛార్జ్‌షీట్‌లో సోనియా, రాహుల్ పేర్లు చేర్చడం ఇదే తొలిసారి. హర్యానాలో జరిగిన రియల్ ఎస్టేట్ ఒప్పందంతో సంబంధమున్న మనీ ల్యాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో వ్యాపారవేత్త, ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాను ఈడీ సోమవారం ప్రశ్నించింది. ఈ ఘటన చోటు చేసుకొన్న కొన్ని గంటలకే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. ఈ కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 25వ తేదీన జరపాలని ఈడీ ప్రత్యేక కోర్టు నిర్ణయించింది.
2012లో నేషనల్ హెరాల్డ్‌పై బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన ఫిర్యాదుతో ఈ కేసు విచారణ ప్రారంభమైంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతోపాటు ఇతరులు యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ద్వారా అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (AJL)ను స్వాధీనం చేసుకున్నారని.. తద్వారా దీని నుంచి రూ. 2,000 కోట్ల విలువైన ఆస్తులను అక్రమంగా పొందారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో సోనియా, రాహుల్, శ్యామ్ ప్రిటాడో, సుమన్ దూబే తదితరులపై ఈడీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. అంతేకాదు.. యంగ్ ఇండియన్ సంస్థ ద్వారా AJL ఆస్తులను అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని ఈ ఛార్జ్‌షీట్‌లో ఈడీ పేర్కొంది. ఈ విచారణలో ఈ ఛార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకునే విషయంలో కోర్టు తన అభిప్రాయం వ్యక్తం చేయనుంది.