ఒకప్పుడు హాట్‌కేకుల్లా అమ్ముడుపోయిన ఆఫీస్ స్పేస్.. ఇప్పుడు ఆదరణ లేక కళావిహీనంగా కనిపిస్తున్నది. అద్దెకు తీసుకునేవారే కరువైపోయారు. గతంలో ఇక్కడ కార్యాలయాలను ఏర్పాటు చేసుకొనేందుకు క్యూ కట్టిన కార్పొరేట్లు.. ప్రస్తుతం ముఖం చాటేస్తున్నారు. దీంతో లక్షల చదరపు అడుగుల్లో కార్యాలయ స్థలాలు ఖాళీగా ఉన్నాయంటూ రియల్ ఎస్టేట్ రిపోర్టులు వస్తున్నాయి.
హైదరాబాద్‌లో కార్యాలయ స్థలాలకు పెద్దగా ఆదరణే లేకుండాపోయింది. ఒకప్పుడు దేశంలోని ప్రధాన నగరాలను వెనక్కినెడుతూ ఆఫీస్ స్పేస్ మార్కెట్‌లో దూసుకుపోయిన రాష్ట్ర రాజధాని నగరానికి ఇప్పుడు డిమాండ్ కనిపించడం లేదు. ఏడాదిన్నర క్రితం వరకు హైదరాబాద్‌లో ఆఫీస్‌ను ఏర్పాటు చేసేందుకు ఉత్సాహం చూపిన కార్పొరేట్లు.. ప్రస్తుతం ఆసక్తి చూపించడం లేదు. ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ వెస్టియన్ విడుదల చేసిన తాజా గణాంకాలే ఇందుకు నిదర్శనం.
దేశంలోని 7 ప్రధాన నగరాల ఆఫీస్ స్పేస్ మార్కెట్‌పై వెస్టియన్ సర్వే చేసింది. దీని వివరాల ప్రకారం హైదరాబాద్‌లోనే గరిష్ఠంగా కార్యాలయ స్థలాలు వృథాగా పడిపోయి ఉన్నట్టు తేలింది. ఏకంగా 284 లక్షల చదరపు అడుగుల్లో ఆఫీస్ స్పేస్ ఖాళీగా ఉన్నదని వెస్టియన్ ఈ సందర్భంగా వెల్లడించింది. ఈ ఏడాది మార్చి నాటికి హైదరాబాద్‌లో మొత్తం అందుబాటులో ఉన్న ఆఫీస్ స్పేస్ 1,620 లక్షల చదరపు అడుగులు. ఇందులో 284 లక్షల చదరపు అడుగులు ఖాళీగానే ఉన్నది. ఇది మొత్తం స్టాక్‌లో 17.5 శాతానికి సమానం. కార్పొరేట్ కంపెనీలు అద్దెకు తీసుకొనేందుకు పెద్దగా ఆసక్తి చూపట్లేదని వెస్టియన్ పేర్కొన్నది.
ఇప్పటికే నిర్మాణం పూర్తయ్యి అందుబాటులో ఉన్న ఆఫీస్ స్పేస్‌కు గిరాకీ అంతంతమాత్రంగానే ఉండటంతో కొత్త నిర్మాణాలు దాదాపుగా ఆగిపోయాయి. రియల్టర్లు, ఆఫీస్ స్పేస్ నిర్మాణ కంపెనీలు నూతన ప్రాజెక్టులకు దూరంగా ఉంటున్నాయి. ఫలితంగా సిమెంట్, ఉక్కు, ఇతర నిర్మాణ అనుబంధ రంగాలు కుదేలయ్యాయి. వాటిమీద ఆధారపడుతున్న పరిశ్రమలు, వ్యాపారులు, ఉద్యోగులు, కూలీల భవిష్యత్తు ఆందోళనలో పడింది. నిజానికి హైదరాబాద్‌లో ఖాళీగా ఉన్న కార్యాలయ స్థలాలు మునుపు ఇంకా ఎక్కువ (19 శాతం)గానే ఉండేవి. కానీ కొత్త ప్రాజెక్టులు రాకపోవడంతో ఇవి కాస్త తగ్గాయి. కాగా, హైదరాబాద్, ఢిల్లీ-ఎన్‌సీఆర్, బెంగళూరు, ముంబై, చెన్నై, కోల్‌కతా, పుణె నగరాలపై వెస్టియన్ సర్వే చేసింది.
దేశంలోని ప్రధాన నగరాల్లో హైదరాబాద్‌లోనే అత్యధికంగా ఆఫీస్ స్పేస్ ఖాళీలు. ఆ తర్వాత ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో ఉన్నాయి. బెంగళూరు (2,805 లక్షల చదరపు అడుగులు) తర్వాత ఎక్కువగా ఆఫీస్ స్పేస్ అందుబాటులో ఉన్నది హైదరాబాద్ (1,620 లక్షల చదరపు అడుగులు)లోనే. ఈ ఏడాది జనవరి-మార్చిలో దేశీయంగా ఆఫీస్ స్పేస్ లీజింగ్ 34 శాతం పెరిగి 179.6 లక్షల చదరపు అడుగులకు చేరిక. జీసీసీలు, ఐటీ, ఐటీ అనుబంధ రంగాలు, బ్యాంకింగ్, ఆర్థిక, బీమా రంగాల నుంచి కనిపించిన డిమాండ్.