హైదరాబాద్ కూకట్‌పల్లిలో కల్తీ కల్లు దందా బయటపడింది. ఐదు దుకాణాల్లోని కల్లు నమూనాలను పరీక్షించగా, నాలుగు చోట్ల అల్ఫ్రాజోలం కలిపినట్లు అధికారులు తేల్చారు. అక్రమాలు జరుగుతున్నా పట్టించుకోలేదంటూ బాలానగర్ ఆబ్కారీ సీఐపై సస్పెండ్ వేటుపడగా, మరికొందరిపైనా ఉన్నతాధికారుల విచారణ జరుగుతోంది. ఆబ్కారీ శాఖ అధికారుల డొల్ల తనిఖీల వల్లే నిరుపేదలు మరణించారని విమర్శలు వినిపిస్తున్నాయి. సాధారణంగా చెట్ల నుంచి సేకరించిన కల్లును మాత్రమే లైసెన్స్ పొందిన దుకాణాల్లో విక్రయించాల్సి ఉన్నా, ఆ నిబంధనలను తుంగలో తొక్కి నిర్వాహకులు కల్తీ కల్లు దందాకు పాల్పడుతున్నారు. తెలుపు రంగు కోసం క్రీము, నురుగు కోసం కరక్కాయ పొడి, మత్తు కోసం అల్ఫ్రాజోలం, క్లోరోహైడ్రేట్ వంటి ప్రమాదకర రసాయనాలు కలుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. అడ్డగోలు వసూళ్ల వల్లే ఆబ్కారీ సిబ్బంది మౌనం వహించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
రాష్ట్రంలో టీఎఫ్టీ (టాడీ ఫర్ ట్యాపర్స్), టీసీఎస్ (టాడీ ట్యాపర్స్ కో-ఆపరేటివ్ సొసైటీ)లు తెల్ల కల్లు అమ్మేందుకు ప్రభుత్వం లైసెన్సులు ఇస్తుంది. తాటి, ఈత చెట్ల నుంచి తీసిన తెల్లకల్లును వీటి ద్వారా విక్రయించుకోవచ్చు. ఆయా టీఎఫ్టీలు, టీసీఎస్లకు వాటి పరిధిలో తాటి వనాలు, ఈత వనాల కేటాయింపు ఉంటుంది. ఊళ్లల్లో ఉండే టీఎఫ్టీలకు కావాల్సినన్ని చెట్లు అందుబాటులో ఉండటంతో కల్తీ పెద్దగా జరగడం లేదు. అదే నగరాల్లో మాత్రం చెట్ల సరిపడా లేక దుకాణాల నిర్వాహకులు కల్తీకి తెరతీస్తున్నారు. మరీ ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ కల్తీ దందా ఎక్కువగా నడుస్తోంది. కొందరు అల్ఫ్రాజోలం, క్లోరల్ హైడ్రేట్, డైజో ఫాంలను కలిపి కల్లు తయారు చేస్తుండగా, మరికొందరైతే ఏకంగా రసాయనాలతో కృత్రిమ(సింథటిక్) కల్లును తయారు చేస్తున్నారు.
కిలోకు రూ.10-15 లక్షల ధర : ఈ అల్ఫ్రాజోలం ఎక్కువగా సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని ఫార్మా కంపెనీల్లో తయారవుతుండగా, మహారాష్ట్రలోనూ కొన్ని ముఠాలు తయారు చేసి రాష్ట్రానికి సరఫరా చేస్తున్నాయి. కిలో రూ.10-15 లక్షలకు ఇక్కడి దుకాణదారులకు అమ్ముతున్నారు. 10 గ్రాముల అల్ఫ్రాజోలంతో ఏకంగా 1200 సీసాల కల్లును తయారు చేస్తూ ఇక్కడి నిర్వాహకులు సొమ్ము చేసుకుంటున్నారు. ఇటీవల కాలంలో కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు తాగి పలువురు అస్వస్థతకు గురి కాగా, టీజీఏఎన్‌బీ దర్యాప్తు చేసి ఈ భారీ రాకెట్‌ను ఛేదించింది. మహారాష్ట్రలో అల్ఫ్రాజోలం తయారు చేస్తున్న పరిశ్రమలను గుర్తించి వాటిని సీజ్ చేయించారు.