రెండేళ్లుగా స్తబ్దుగా ఉన్న భారత్-కెనడా సంబంధాల పునరుద్ధరణకు ప్రయత్నాలు మళ్లీ ప్రారంభమయ్యామని విదేశాంగ మంత్రిత్వ శాఖ పునరుద్ఘాటించింది. ఇరు దేశాలు హైకమినర్లను నియమించే పనిలో ఉన్నాయని వెల్లడించింది. భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు.
‘జీ7 సదస్సు సందర్భంగా కెనానాస్కిస్లో ప్రధాని స్థాయిలో సమావేశం జరిగింది. అక్కడు ఇరు దేశాల నేతలు భారత- కెనడా సంబంధాల ప్రాముఖ్యతను, మళ్లీ పునరుద్ధరించే విషయంపై చర్చించారు. అందుకోసం ఇరు దేశాలు కలిసి పని చేస్తున్నాయి. రాజధానుల్లో హైకమిషనర్ల నియామకంపై కూడా కృషి కొనసాగుతోంది. భారత్-కెనడా సంబంధాల్లో వచ్చిన ఈ మార్పుపై సానుకూలంగా ఉన్నాం’ అని అన్నారు.
గతనెల జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, కెనడా ప్రధాని మార్క్ కార్నీ భేటీ అనంతరం విదేశాంగ శాఖ అధికారికంగా ఓ ప్రకటనను విడుదల చేశామని జైస్వాల్ గుర్తు చేశారు.’ జీ7 సందర్భంగా కెనడా, భారత్ ప్రధానుల మధ్య సానుకూల, నిర్మాణాత్మక సమావేశం జరిగింది. ఈ భేటీలో ఇరుదేశాల భాగస్వామ్య విలువలు, ప్రజాస్వామ్యం, న్యాయపాలన వంటి అంశాలపై చర్చించారు. ఇరుదేశాల మధ్య బలోపేతమైన చర్యలకు అడుగులు పడ్డాయి. అందులో మొదటిది హై కమిషనర్ల పునర్ నియామకం. అందుకు ఇరుదేశాలు అంగీకరిచారు’ అని జైస్వాల్ తెలిపారు.
2023లో ఖలిస్థానీ అనుకూలవాది నిజ్జర్ హత్య వెనక భారత ప్రభుత్వ ఏజెంట్ల హస్తం ఉందంటూ కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలు చేశారు. దీంతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. కాగా, భారత్ మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపారేసింది. ఆ సమయంలోనే కెనడా-భారత్ రాయబారులను వెనక్కి పిలిపించారు. కెనడాలో ఉగ్రవాదం, భారత్ వ్యతిరేక కార్యకలాపాలపై భారత్ పదేపదే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. అలాంటి శక్తులపై చర్యలు తీసుకోవాలని కెనడా అధికారులను కోరుతోంది. ఆ తర్వాత కెనడా ఎన్నికల్లో న్యూదిల్లీ జోక్యం చేసుకోనుందని ఆ దేశ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ డిప్యూటీ డైరెక్టర్ వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఇరుదేశాల ప్రధానుల భేటీ అనంతరం హైకమిషనర్లను నియమిచేందుకు ఇరుదేశాలు అంగీకరించాయి.