భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (ఏఏఐ)లో భారీ నిధుల దుర్వినియోగం వెలుగుచూసింది. ట్రేడింగ్ కార్యకలాపాల కోసం ఏఏఐకు చెందిన రూ.232 కోట్ల ప్రజాధనాన్ని తన వ్యక్తిగత ఖాతాల్లోకి మళ్లించినట్లు ఆరోపణలున్న సీనియర్ మేనేజర్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అరెస్ట్ చేసింది. అధికారుల వివరాల ప్రకారం.. ఆర్థిక అకౌంటింగ్ విభాగంలో పని చేస్తున్న రాహుల్ విజయ్ అనే సీనియర్ మేనేజర్ 2019 నుంచి 2023 మధ్యకాలంలో ప్రణాళికాబద్ధంగా నిధులను మళ్లించినట్లు గుర్తించారు.
ఏఏఐ ఇటీవల నిర్వహించిన అంతర్గత ఆడిట్‌లో నిధుల అవకతవకలు బయటపడిన నేపథ్యంలో, ఒక ప్రత్యేక కమిటీని నియమించి దర్యాప్తు ప్రారంభించింది. ఈ విచారణలో రాహుల్ విజయ్ పాల్పడిన అక్రమాలు వెలుగు చూశాయి. వెంటనే సంస్థ అధికారులు సీబీఐకి ఫిర్యాదు చేశారు. సీబీఐ రంగంలోకి దిగి జైపూర్‌లోని రాహుల్ విజయ్ అధికారిక కార్యాలయం, నివాస ప్రదేశాల్లో సోదాలు జరిపింది. ఈ సందర్భంగా స్థిరాస్తులకు సంబంధించిన పత్రాలు, ఇతర విలువైన ఆధారాలు స్వాధీనం చేసుకుంది.
“డెహ్రాడూన్ విమానాశ్రయంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో అధికారిక రికార్డులు, ఎలక్ట్రానిక్ డేటాను తారుమారు చేస్తూ, నిధులను ట్రేడింగ్ ఖాతాలకు మళ్లించారు. బ్యాంక్ లావాదేవీల విశ్లేషణలో దీన్ని స్పష్టంగా గుర్తించాం” అని సీబీఐ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం రాహుల్ విజయ్‌ను అదుపులోకి తీసుకుని మరింత విచారణ కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజాధన దుర్వినియోగం నేపథ్యంలో కేంద్ర స్థాయిలో ఈ అంశం సంచలనంగా మారింది.