కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ పార్టీలపై ఎలాంటి వివక్ష చూపమని స్పష్టం చేశారు. దిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల సంఘం అన్ని రాజకీయ పార్టీలను సమానంగా చూస్తుందని, ఓటు చోరీ ఆరోపణలను తోసిపుచ్చారు. బిహార్‌లో ఓటరు జాబితా సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ – ఎస్‌ఐఆర్)పై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో, రాజ్యాంగ సంస్థలను అవమానించడం సరికాదని ఆయన అన్నారు. ఓటరు జాబితాను బూత్ స్థాయిలో పార్టీలు పరిశీలిస్తాయని, సవరణలు పారదర్శకంగా జరుగుతాయని వివరించారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ మాట్లాడుతూ, “బిహార్‌లో ఎస్‌ఐఆర్‌పై కొన్ని పార్టీలు అసత్య ప్రచారం చేస్తున్నాయి. ఇది ఆందోళనకరం. ఎన్నికల సంఘంపై కొన్ని పార్టీలు దాడులు చేస్తున్నాయి. ఓటరు ముసాయిదా జాబితాలపై అభ్యంతరాలు ఉంటే సెప్టెంబర్ 1లోగా తెలియజేయాలని పార్టీలను కోరాం. బూత్ స్థాయి అధికారులు, ఏజెంట్లు పారదర్శకంగా పనిచేస్తున్నారు,” అని పేర్కొన్నారు. “డబుల్ ఓటింగ్, ఓటు చోరీ ఆరోపణలకు భయపడాల్సిన అవసరం లేదు. కోట్లాది మంది ఉద్యోగులు ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉన్నారు. ఇంత పారదర్శకంగా జరిగే ప్రక్రియలో ఓటు చోరీ ఎలా సాధ్యం? ఆధారాలు లేకుండా ఓటరు పేరును తొలగించం,” అని ఆయన స్పష్టం చేశారు.
ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 10 సార్లకు పైగా ఎస్‌ఐఆర్‌లు నిర్వహించామని, పశ్చిమ బెంగాల్‌తో సహా ఇతర రాష్ట్రాల్లో కూడా సవరణలు జరుగుతాయని ఆయన తెలిపారు. అభ్యంతరాలు ఉంటే సెప్టెంబర్ 1లోగా తెలియజేయాలని పార్టీలను కోరారు.
కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుందన్న వాదనను “హాస్యాస్పదం” అని విమర్శించింది. రాహుల్ గాంధీ లేవనెత్తిన ప్రశ్నలకు సీఈసీ సమాధానం ఇవ్వలేకపోయారని, ఈసీ సొంత డేటాను ఆధారంగా చేసుకుని రాహుల్ వాస్తవాలను ప్రస్తావించారని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. బిహార్ ఓటరు జాబితా సవరణపై సుప్రీంకోర్టు ఆదేశాలను ఈసీ అక్షరాలా అమలు చేస్తుందా అని ప్రశ్నించారు. ఈసీ వైఖరి అసమర్థతను, పక్షపాతాన్ని తెలియజేస్తోందని ఆరోపించారు.