ఇంటర్నెట్ డెస్క్: ప్రధాని నరేంద్ర మోదీ డిగ్రీ వివరాలను వెల్లడించాలని కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) దిల్లీ విశ్వవిద్యాలయానికి జారీ చేసిన ఆదేశాలను దిల్లీ హైకోర్టు రద్దు చేసింది. ఫిబ్రవరి 27, 2025న రిజర్వ్ చేసిన తీర్పును జస్టిస్ సచిన్ దత్తా ఆగస్టు 25, 2025న వెలువరించారు.
నీరజ్ అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద ప్రధాని మోదీ 1978లో బీఏ పూర్తి చేసిన వివరాల కోసం దరఖాస్తు చేశారు. 2016 డిసెంబరులో సీఐసీ ఆ ఏడాది బీఏ ఉత్తీర్ణుల రికార్డుల తనిఖీకి అనుమతించింది. దీనిని సవాలు చేస్తూ దిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ) 2017 జనవరిలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా కోర్టు సీఐసీ ఆదేశాలను స్టే చేసింది.
డీయూ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తూ తెలుసుకునే హక్కు కంటే వ్యక్తిగత గోప్యత హక్కు ఉన్నతమని, సీఐసీ ఆదేశాలను రద్దు చేయాలని కోరారు. ప్రధాని డిగ్రీ వివరాలను కోర్టుకు చూపించడానికి డీయూ సిద్ధంగా ఉన్నప్పటికీ ఆర్టీఐ కింద అపరిచితులతో పంచుకోవడానికి వ్యతిరేకమని తెలిపింది. విద్యార్థుల రికార్డులను సంరక్షణదారుగా భావించే డీయూ ఒకరి ఆసక్తి తీర్చడానికి ఆ వివరాలను బయటపెట్టాల్సిన అవసరం లేదని వాదించింది.