మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ (Jagdeep Dhankhar) తన పదవీకాలం మిగిలి ఉన్నప్పటికీ ఆరోగ్య కారణాలతో రాజీనామా చేసిన సంగతి తెలిసింది. ఇప్పుడు ఆయన రాజస్థాన్ శాసనసభలో మాజీ ఎమ్మెల్యేగా పింఛనుకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ ప్రక్రియ ఇటీవల మొదలైంది. రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర్ వాసుదేవ్ దేవనాని దీనిని ధృవీకరించారు.
ధన్‌ఖర్ గతంలో 1993 అసెంబ్లీ ఎన్నికల్లో అజ్మీర్‌లోని కిషన్‌గఢ్ నుంచి కాంగ్రెస్ తరపు ఎమ్మెల్యేగా గెలిచారు. 1993 నుంచి 1998 వరకు ఆ పదవిలో ఉండి, 1994-1997 మధ్య అసెంబ్లీ రూల్స్ కమిటీ సభ్యుడిగా కూడా పనిచేశారు. రాజస్థాన్ మాజీ ఎమ్మెల్యేలకు నిబంధనల ప్రకారం రూ.35 వేల పింఛను అందుతుంది. వయసు ఆధారంగా అదనపు మొత్తం ఉంటుంది. 70 ఏళ్లు దాటినవారికి 20% పెంపు, 80 ఏళ్లు దాటినవారికి 30% పెంపు. ప్రస్తుతం 74 ఏళ్ల ధన్‌ఖర్‌కు రూ.42 వేల పింఛను లభించనుంది. మాజీ ఉపరాష్ట్రపతిగా ఆయనకు ఇంకా రూ.2 లక్షలు పైగా పింఛను లభిస్తుంది, కాబట్టి మొత్తం పింఛను గణనీయంగా పెరుగుతుంది.