త్వరలోనే భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా అవతరించనుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. భారత్ అన్నిరంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. అందుకు ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఫలితాలే నిదర్శనంగా నిలుస్తున్నాయని అన్నారు. దిల్లీలో సెమికాన్-ఇండియా సదస్సును ప్రారంభించిన తర్వాత ప్రసంగించిన ప్రధాని మోదీ, తొలి త్రైమాసికంలో 7.8 శాతం వృద్ధిరేటు సాధించినట్లు చెప్పారు.
‘సదస్సులో 40 దేశాల ప్రతినిధులు పాల్గొనడం సంతోషకరం. భారత్ ఆవిష్కరణలు, యువ శక్తి కూడా సదస్సులో ఉంది. ప్రపంచ దేశాలకు భారత్‌పై నమ్మకం పెరిగింది. పోటీ పెరిగిన తరుణంలోనూ భారత్‌కు ఆదరణ తగ్గలేదు. సెమీ కండక్టర్ల రంగంలో ప్రపంచ దేశాలు భారత్‌తో కలిసి వస్తున్నాయి. ఆత్మనిర్భర్ భారత్ యాత్రలో దేశానికి కీలక భాగస్వాములున్నారు. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో భారత్ జీడీపీ గణనీయ వృద్ధి సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం ఉన్నా, భారత్ పురోభివృద్ధి సాధిస్తోంది. ఆర్థిక మందగమనంలోనూ భారత్ 7.8 శాతం వృద్ధిరేటు సాధించింది. అన్ని రంగాల్లోనూ భారత్ గణనీయ పురోభివృద్ధి సాధిస్తోంది. భారత్ త్వరితగతిన సరికొత్త శిఖరాలు అధిరోహిస్తోంది’ అని ప్రధాని మోదీ అన్నారు.
దిల్లీలో సెమీకాన్ ఇండియా సదస్సు-2025లో కేంద్రమంత్రులు అశ్వినీ వైష్ణవ్, జితిన్ ప్రసాద, దిల్లీ సీఎం రేఖా గుప్తా పాల్గొన్నారు. మేకిన్ ఇండియా తొలి మైక్రోప్రాసెసర్ చిప్‌ను ప్రధాని మోదీకి కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ అందించారు. విక్రమ్ 32 బిట్ ప్రాసెసర్, టెస్ట్ చిప్స్‌ను ఇస్రో సెమీకండక్టర్ ల్యాబ్ అభివృద్ధి చేసింది. వాహకనౌకల్లో కఠిన వాతావరణ పరిస్థితుల్లోనూ పనిచేసేలా చిప్ రూపకల్పన చేసింది. సెమీకండక్టర్ ఎకోసిస్టమ్ పెంపొందించడమే లక్ష్యంగా కేంద్రం చర్యలు చేపట్టింది.