భారత్, చైనా మధ్య సంబంధాలు (India-China Relations) స్థిరమైన పురోగతిని సాధించాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. గత ఏడాది రష్యాలోని కజాన్‌లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ (Jinping)తో తన భేటీ అనంతరం పరిస్థితుల్లో సానుకూల మార్పు వచ్చిందన్నారు. భారత పర్యటనలో ఉన్న చైనా విదేశాంగశాఖ మంత్రి వాంగ్ యీ నేడు ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. అనంతరం ప్రధాని (Modi) ఈ మేరకు ట్వీట్ చేశారు.
‘‘వాంగ్ యీని కలవడం ఆనందంగా ఉంది. గతేడాది కజాన్‌లో జిన్‌పింగ్ (Xi Jinping)తో సమావేశమైనప్పటినుంచి.. ఇరుదేశాల సంబంధాలు స్థిరమైన పురోగతిని సాధించాయి. పరస్పర ప్రయోజనాలు, సున్నిత అంశాలను గౌరవించడం ద్వారా ఇది సాధ్యమైంది. చైనాలోని తియాంజిన్‌లో నిర్వహించనున్న ‘షాంఘై సహకార సంస్థ’ (SCO) శిఖరాగ్ర సదస్సు సమయంలో జిన్‌పింగ్‌తో సమావేశం కోసం ఎదురు చూస్తున్నాను. భారత్, చైనా (China)ల మధ్య స్థిరమైన, నిర్మాణాత్మక సంబంధాలు.. ప్రాంతీయ, ప్రపంచ శాంతికి, అభివృద్ధికి దోహదపడతాయి’’ అని ప్రధాని మోదీ (Narendra Modi) ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు.
సరిహద్దులో పరిస్థితులు మెరుగుపడ్డాయ్ – అజిత్ డోభాల్
రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా భారత విదేశాంగశాఖ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డొభాల్ తదితరులతో వాంగ్ యీ సమావేశమైన విషయం తెలిసిందే. పరస్పర గౌరవం, సున్నితత్వం, ప్రయోజనాల ఆధారంగా ఇరుదేశాల సంబంధాలు ముందుకు సాగాలని జైశంకర్ ఆకాంక్షించారు. చైనాలో ఆగస్టు 31, సెప్టెంబర్ 1వ తేదీల్లో జరిగే ఎస్‌సీవో సదస్సుకు ప్రధాని మోదీ హాజరవుతున్నారని అజిత్ డొభాల్ అధికారికంగా ప్రకటించారు.