రాహుల్ యాత్రలో జరిగిన ఘటన రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఇటీవల దర్భంగా జిల్లాలో రాహుల్ పర్యటించగా, స్థానికంగా ఉన్న ఓ దాబా ఆపరేటర్ బైక్‌ను సెక్యూరిటీ సిబ్బంది తీసుకెళ్లిపోయారని ఆరోపణ వెలుగులోకి వచ్చింది. దీంతో అది రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించడమే కాకుండా, భద్రతా వ్యవస్థపై తీవ్రమైన ప్రశ్నలను కూడా లేవనెత్తింది.
అసలేం జరిగిందంటే?
శుభం సౌరభ్ అనే యువకుడు NH-27లోని చక్కా ప్రాంతంలో మా దుర్గ దాబాను నడుపుతున్నాడు. అయితే ఓటర్ అధికార్ యాత్ర వేళ, రాహుల్ గాంధీ భద్రత కోసం నియమితులైన భద్రతా సిబ్బంది తన దాబా వద్దకు వచ్చారని శుభం తెలిపాడు. దాబాలో టీ తాగారని చెప్పాడు. ఆ తర్వాత తన పల్సర్ 220 బైక్ (BR 07 AL 5605) అడిగారని సౌరభ్ ఆరోపించాడు.
తాను మొదట ఇవ్వడానికి నిరాకరించాడని, ఆ తర్వాత ఒత్తిడి తెచ్చారని శుభం తెలిపాడు. చివరికి బైక్‌ను బలవంతంగా తీసుకెళ్లారని ఆరోపించాడు. తన మామ అనిల్ రాయ్ పేరు మీద బైక్ రిజిస్టర్ అయిందని పేర్కొన్నాడు. అయితే తన వాహనంతో పాటు మరో ఆరుగురు వ్యక్తుల బైక్‌లను కూడా భద్రతా సిబ్బంది తీసుకెళ్లారని, వాటిలో ఆరు బైక్‌లు రోడ్డు పక్కన కనిపించాయని చెప్పాడు.
“నేను NH-27 చక్కా సమీపంలోని నా దాబాలో ఉన్నా. అక్కడ సెక్యూరిటీ గార్డులు టీ తాగి, ఆపై బైక్ కోసం అడిగారు. మొదట నిరాకరించినప్పటికీ, నాపై ఒత్తిడి తెచ్చి బైక్‌ను తీసుకున్నారు. నా వాహనంతోపాటు మరో ఆరు బైక్‌లను కూడా తీసుకెళ్లారు. వాటిలో ఆరు రోడ్డు పక్కన కనిపించాయి, కానీ నా బైక్ ఎక్కడా కనిపించలేదు”
-శుభం సౌరభ్, దాబా యజమాని
అయితే రాహుల్ యాత్రకు సంబంధిచిన భద్రతా సిబ్బంది కాల్ రికార్డింగ్‌లు కూడా తన వద్ద ఉన్నాయని శుభం చెప్పాడు. బైక్ కోసం శుభంతోపాటు అతడి కుటుంబసభ్యులు ముజఫర్‌పుర్, సీతామర్హి, మోతీహరి, ఢాకా వంటి వంటి జిల్లాల్లో వెతికారు. కానీ వాహనం ఎక్కడా దొరకలేదని, ఇప్పటివరకు 15 నుంచి 20 వేల రూపాయలు ఖర్చు చేశామని తెలిపాడు.
కాగా, బైక్ విషయంలో స్థానిక, పోలీసులకు ఫిర్యాదు చేశానని శుభం పేర్కొన్నాడు, కానీ ఇప్పటివరకు ఎటువంటి చర్య తీసుకోలేదని ఆరోపించాచు. మొత్తం సంఘటనకు సంబంధించిన కొంతమంది భద్రతా సిబ్బంది కాల్ రికార్డింగ్‌లు తన వద్ద ఉన్నాయని, దీని కారణంగా ఆ విషయం మరింత తీవ్రంగా మారిందని చెప్పాడు. కాంగ్రెస్ నాయకుడు మదన్ మోహన్ ఝా నంబర్‌ను ఒక సెక్యూరిటీ గార్డు తనకు ఇచ్చాడని, ఆయనను సంప్రదించానని పేర్కొన్నాడు. ఆయన దర్భంగాకు వచ్చినప్పుడు మాట్లాడుతానని హామీ ఇచ్చారని చెప్పాడు.