ఇంగ్లాండ్ పర్యటనలో భారత్ కు ఎదురు దెబ్బ తగిలింది. బ్యాటింగ్ ఆల్ రౌండర్, తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి గాయం కారణంగా మిగతా టెస్టులకు దూరమైనట్లు తెలుస్తోంది. అతని గాయానికి కారణం తెలియక పోయినప్పటికీ, మిగతా రెండు టెస్టులకు దూరమైనట్లు మాత్రం తెలుస్తోంది. ఈనెల 23 నుంచి ఇంగ్లాండ్, ఇండియా జట్ల మధ్య నాలుగో టెస్టు మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రాఫోర్డు వేదికగా జరుగుతుంది. ఇప్పటికే ఐదు టెస్టుల సిరీస్ లో రెండు మ్యాచ్ లు ఓడి 1-2తో వెనుకంజలో ఉన్న భారత్, ఈ మ్యాచ్ గెలిచి, సిరీస్ సమం చేయాలని భావిస్తోంది. అయితే ఇప్పుడు నితీశ్ దూరం కావడం ప్రతికూలంగా మారింది. తాజాగా మాంచెస్టర్ కు చేరుకున్న భారత్ కు వర్షం స్వాగతం పలికింది. దీంతో ఇండోర్ సెషన్ లోనే టీమిండియా ప్లేయర్లు ప్రాక్టీస్ కొనసాగించారు. ఇది ఆప్షన్ ట్రైనింగ్ సెషన్ కావడంతో కొంతమంది ఈ సెషన్ ను స్కిప్ చేశారు. వారిలో కెప్టెన్ శుభమాన్ గిల్, కేఎల్ రాహుల్, జస్ ప్రీత్ బుమ్రా, రిషభ్ పంత్, నితీశ్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ తదితర ప్లేయర్లు ఉన్నారు.
మరోవైపు లెఫ్టార్మ్ పేసర్ అర్షదీప్ సింగ్ కూడా గాయం కారణంగా సిరీస్ కు దూరమైనట్లు తెలుస్తోంది. ప్రాక్టీస్ సెషన్ లో బంతిని ఆపుతుండగా, బౌలింగ్ చేసే ఎడమ చేతికి గాయమైనట్లు తెలుస్తోంది. గాయం తీవ్రత దృష్ట్యా అతడిని పక్కన పెట్టాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. అతని స్తానంలో మరో ఆల్ రౌండర్ అన్షుల్ కాంబోజ్ ను టీమ్ లోకి ఎంపిక చేశారు. దేశవాళీల్లో అదరగొట్టిన అన్షుల్ అన్నీ అనుకున్నట్లు జరిగితే నాలుగో టెస్టులో అరంగేట్రం చేసే అవకాశముంది. ఇప్పటికే భారత్ ఏ తరపున ఇంగ్లాండ్ లయన్ పై ఐదు వికెట్లు తీసి, ఒక అర్ద సెంచరీని కూడా సాధించాడు. వికెట్ టేకింగ్ తోపాటు లోయర్ ఆర్డర్ లో పరుగులు సాధించగల సత్తా అతని సొంతం. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున కూడా ఆడి , ఆకట్టుకున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 24 మ్యాచ్ లు ఆడిన కాంబోజ్.. 79 వికెట్లు తీశాడు.