అనాథ యువతికి అధికారులు, ప్రజాప్రతినిధులే అమ్మానాన్నలయ్యారు. చిరుప్రాయంలోనే బాలసదనానికి చేరి సిబ్బంది సంరక్షణలో పెరిగి, పెళ్లీడుకొచ్చిన యువతికి మేమున్నామంటూ కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పెండ్లి పెద్దలై, కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కళాభవన్ వేదికగా అంగరంగవైభవంగా వివాహాన్ని జరిపించారు.
ఆమెకు అధికారులే చదువు చెప్పించి, ఆలనాపాలనా చూశారు. ఇంటర్మీడియట్ అనంతరం ఎంపీహెచ్‌డబ్ల్యూ కోర్సు చేసి ఇంటర్న్‌షిప్ చేస్తుండగా, పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన సాయితేజతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఈ విషయాన్ని యువతి అధికారులకు చెప్పడంతో వారు ఆ యువకుడు, కుటుంబసభ్యులతో మాట్లాడి పెళ్లి నిశ్చయించారు. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అతిథులకు భోజనం ఏర్పాటు చేశారు. కలెక్టర్, జిల్లా జడ్జి, అధికారులు, టీఎన్జీవో నాయకులు తమవంతు సహాయసహకారాలు అందజేయడంతో మౌనిక వివాహం అత్యంత ఘనంగా జరిగింది.