ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆర్సెలార్ మిట్టల్ ఎగ్జిక్యూటీవ్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్ బ్రిటన్ ని వీడనున్నట్లు తెలిసింది. మూడు దశాబ్దాలుగా బ్రిటన్ లోనే నివసిస్తున్న లక్ష్మీ మిట్టల్ కొత్త ప్రభుత్వ నిర్ణయంతో ఆ దేశాన్ని విడిచిపెట్టాలనుకుంటున్నట్లు, ఆయన బాటలోనే మరికొందరు సంపన్నులు నడవనున్నట్లు అంతర్జాతీయ కథనాలు వెలువడ్డాయి.
బ్రిటన్లో Non-Dome-Tax విధానాన్ని రద్దు చేయాలని కొత్త ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పన్ను విధానం ప్రకారం UK నివాసితులు తాము విదేశాలలో సంపాదించిన మొత్తానికి ఆదాయపన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. 226 సంవత్సరాల నుండి ఈ పన్ను విధానం అమలులో వుంది. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న కొత్త నిర్ణయం ఆ దేశ సంపన్నులను ఆలోచనలో పడేసింది. వారు పన్ను మినహాయింపులకు స్వర్గధామంలా వుండే దేశాల వైపు చూసేలా UK కొత్త ప్రభుత్వం నిర్ణయం పురికొల్పింది. అలా చూస్తున్నవారిలో లక్ష్మీ మిట్టల్ కూడా వున్నట్లు వార్తలు వచ్చాయి.
“Sunday Times” గతేడాది విడుదల చేసిన సమాచారం ప్రకారం లక్ష్మీ మిట్టల్ కి 14.9 బిలియన్ పౌండ్ల సంపద వుంది. ఆయనకి బ్రిటన్లోనూ, అమెరికాలోనూ అపారమైన ఆస్తులు వున్నాయి. ప్రస్తుతం ఆయన దుబాయ్ లో ఎక్కువగా పెట్టుబడులు పెడుతున్నారు. ప్రస్తుతం UK ప్రభుత్వ కొత్త నిర్ణయంతో ఆయన UAE, స్విట్జర్లాండ్, ఇటలీలలో ఏదో ఒక దేశానికి తన మకాం మార్చాలని యోచిస్తున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి.
ఇలా పారిశ్రామికవేత్తలు దేశాన్ని వీడి వెళ్లిపోవడం దేశ ఆర్ధికాభివృద్ధికి ఒక క్లిష్టమైన సవాలేనని ఆర్ధిక నిపుణులు అంటున్నారు.