ప్రముఖ సీనియర్ నటి, అలనాటి గ్లామర్ క్వీన్, పద్మభూషణ్ గ్రహీత బి. సరోజాదేవి (87) సోమవారం (జులై 14, 2025) ఉదయం బెంగళూరులోని తన నివాసంలో వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యల కారణంగా కన్నుమూశారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో 200కు పైగా సినిమాల్లో నటించిన ఆమె, ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎంజీఆర్ వంటి దిగ్గజ నటులతో కలిసి అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. 1955లో ‘మహాకవి కాళిదాస’ కన్నడ చిత్రంతో సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఆమె, తెలుగులో ‘పెళ్లిసందడి’, ‘పాండురంగ మహత్యం’, ‘భూకైలాస్’, ఆత్మబలం వంటి చిత్రాలతో గుర్తింపు పొందారు.
‘అభినయ సరస్వతి’, ‘కన్నడతు పైంగిలి’గా పిలువబడిన సరోజాదేవి, 1969లో పద్మశ్రీ, 1992లో పద్మభూషణ్, బెంగళూరు విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్, తమిళనాడు ప్రభుత్వం నుంచి కలైమామణి అవార్డులను అందుకున్నారు. ఆమె మరణం సినీ పరిశ్రమలో విషాదాన్ని నింపింది. మాజీ సీఎం వైఎస్ జగన్, ఇతర సినీ ప్రముఖులు ఆమె మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు, ఆమె సేవలు చిరస్థాయిగా గుర్తుండిపోతాయని పేర్కొన్నారు.