భారతదేశం అంటే కేవలం ఆధ్యాత్మికతయేనా? నమ్మకాలు, ఆచారాలు, సంప్రదాయాలేనా? భారతీయ తత్వం అంటే వేదిక్ ఫిలాసఫీ మాత్రమేనా? జ్ఞానం అంటే కేవలం మత గ్రంథాలు, పురాణేతిహాసాల అధ్యయనమేనా? శాస్త్రం – అంటే ఆధారాలతో పనిలేకుండా, కేవలం నమ్మకాలతో ముడిపడిన విషయాల సమ్మిళితమేనా? మనదేశంలో ఫిలాసఫీ అంటేనే వేదాంత అనే అర్థం ఎందుకు వచ్చింది?
హేతుబద్ధంగా ఆలోచించడం మొదలుపెట్టిన ఎవరికైనా ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఖచ్చితంగా తలెత్తుతాయి. ఆ ప్రశ్నలన్నింటికీ సమాధానంగా “కాదు” అని చెప్పటానికి, పురాతన స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ ఒకటి మనదేశంలో ఉంది. అదే లోకాయత స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ.
‘లోకాయత’ అంటే ‘ప్రజల యొక్క’ అని అర్థం. లోకాయత అనే పదాన్ని తొలిసారిగా ప్రాచీన బౌద్ధులు ప్రయోగించారు. లోకాయతకు, చార్వాక అనే మరో పేరు కూడా ఉంది. ఈ స్కూల్ ఆఫ్ ఫిలసఫికల్ థాట్ ని స్థాపించిన ఇరువురిలో ఒకరు చార్వాకుడు కావడం ఇందుకు కారణం. మూడు ప్రధాన భారతీయ స్కూల్ ఆఫ్ ఫిలాసఫీలలో ఇదీ ఒకటి. వేదాంత, సాంఖ్య స్కూల్ ఆఫ్ ఫిలాసఫీలు ఇతర రెండు. ‘ఇండియన్ ఫిలాసఫీ అంటే వేదాంత ఒక్కటే’ కాదని ఇక్కడ అర్థం అవుతుంది.
“ఇండియన్ మెటీరియలిజం” గా లోకాయత ఫిలాసఫీకి పేరుంది. లోకాయత ఫిలాసఫీ నమ్మకాలపై ఆధారపడి ఉండదు. అన్ని సూపర్ నేచురల్ విషయాలని తిరస్కరిస్తుంది. దేవుడు, ఆత్మ, పునర్జన్మ, స్వర్గం – నరకం, కర్మ సిద్ధాంతం వంటి వాటిని ఖండిస్తుంది. భౌతిక ప్రపంచానికి సంబంధించని విషయాలని – పూర్తిగా సైంటిఫిక్, నాచురలిస్టిక్ అప్రోచ్ లో అధ్యయనం చేస్తుంది. నీతి శాస్త్రాలకు ప్రాధాన్యత ఇవ్వదు. జైనిజం, బుద్ధిజం వంటి అన్ని మతాల భోధనలని సంశయిస్తుంది. అథారిటీ కలిగిఉన్న ఏ సిస్టం ని కూడా లోకాయత ఫిలాసఫీ అంగీకరించలేదు. లోకాయత, వ్యక్తి ప్రాధాన్యంగా వ్యవస్థను నిర్మించుకోమని చెప్పే ఫిలాసఫీ.
అయితే,
అప్పట్లో వేదాంత ఫిలాసఫీల ద్వారా ప్రజల్లో ప్రాచుర్యం పొందుతున్న మత గురువులు, వారి ఉనికికి భంగం వాటిల్లుతుందని భావించి – లోకాయత ఫిలాసఫీని తిరస్కరించారు. ఆ ఫిలాసఫీకి సంబంధించిన పుస్తకాలను కాల్చివేసారు. ప్రజలకు చేరనీయలేదు. తత్వం అంటే అది ‘మూఢనమ్మకాలతో కూడిన’ వేదాంత మాత్రమే అనుకునేలా చేసారు. అయినా, లోకాయత ఫిలాసఫీ పూర్తిగా అంతరించి పోలేదు కానీ కేవలం కొందరికి మాత్రమే తెలిసిన ఫిలాసఫీగా, అంతగా ప్రాచుర్యంలోకి రాకుండా ఉంది.
మెటీరియలిస్ట్ ప్రపంచాన్ని స్పిరిచువాలిటీ ఒక భారంగా, దుఃఖానికి మూలంగా చెప్తుంది. పరిశోధనకు ‘మాటర్’ పైననే ఆధారపడే సైన్స్, స్పిరిచువాలిటీకి ప్రాధాన్యతనిచ్చిన దేశాలలో అంతగా అభివృద్ధి చెందినట్టుగా మనకు కనిపించదు. పాశ్చాత్యులు ఎప్పటినుంచో మెటీరియల్ ప్రపంచంపైననే ఎక్కువ దృష్టి సారించారు. ఆర్థికంగా, సామాజికంగా ఇంకా జీవనప్రమాణాల విషయంలో బాగా అభివృద్ధి చెందిన దేశాలు అన్నీ భౌతిక ప్రపంచానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన దేశాలే. విశ్వాసాలకు, ఆధ్యాత్మికతకు అధిక ప్రాముఖ్యతనిచ్చి, భౌతిక ప్రపంచాన్ని విస్మరించిన అన్ని దేశాలూ ప్రపంచ గణాంకాలలో అడుగున ఉంటున్నాయి.
మనదేశంలో వేదాంత ఫిలాసఫీ ద్వారా ఆధ్యాత్మికత వైపు కాకుండా, లోకాయత వంటి భౌతిక ప్రపంచానికి ప్రాముఖ్యతనిచ్చిన ఫిలాసఫీలకు అధిక ప్రాధాన్యత అప్పటినుంచే ఇవ్వబడి ఉంటే, నేడు మనదేశంలో ఆశాస్త్రీయత పూర్తిగా తగ్గిపోయి, శాస్త్ర – సాంకేతిక రంగాలలో ఇండియా ఆధిక్యంలో ఉండి, ఇప్పటికే చాలా అభివృద్ధి చెందిన దేశంగా ఉండి ఉండేది!?