ఐదు రోజుల నిరాహార దీక్ష తర్వాత మరాఠా కోటా ఉద్యమానికి విజయం వరించిందని మనోజ్ జరాంగే పాటిల్ ప్రకటించారు. అనంతరం నిరాహార దీక్షను ముగించిన ఆయన, మరాఠాలు గెలిచారని ఆనందం వ్యక్తంచేశారు. మరాఠాలు, కున్బీలు ఒకే కమ్యూనిటీకి చెందినవారని గుర్తిస్తూ జీఆర్ జారీ చేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వానికి 2 నెలల సమయం ఇస్తున్నట్లు తెలిపారు.
మరాఠా కోటా కోసం జరిగిన ఆందోళనల్లో తమవారిని కోల్పోయిన బాధిత కుటుంబాలకు వారంలోగా పరిహారం చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని జరాంగే చెప్పారు. మరాఠా ఉద్యమకారులపై పెట్టిన కేసులన్నిటినీ ఉపసంహరించుకుంటామని ప్రభుత్వం తరఫున చర్చలకు వచ్చిన మంత్రుల బృందం హామీ ఇచ్చిందని వెల్లడించారు.
మరోవైపు ఆజాద్ మైదాన్‌ను ఖాళీ చేసేందుకు జరాంగేకు బాంబే హైకోర్టు రేపు ఉదయం వరకు సమయం ఇచ్చింది. రేపటిలోగా ఆజాద్ మైదాన్ ను ఖాళీ చేయించకపోతే, చట్టం గౌరవాన్ని కాపాడేందుకు ఎంత దూరమైనా వెళ్లాల్సి వస్తుందని పేర్కొంది. ఇందుకోసం కోర్టే ఉత్తర్వులు జారీ చేస్తుందని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో జరాంగే వద్దకు మహారాష్ట్ర మంత్రుల బృందం వెళ్లి చర్చలు జరిపింది. చాలా వరకు డిమాండ్లను అంగీకరించింది. దీనితో మరాఠా వర్గానికి 10 శాతం కోటా కావాలని చేస్తున్న నిరాహార దీక్షను జారంగే విరమించారు. ఈ విజయంతో ఆయన మద్దతుదారులు సంబరాలు చేసుకున్నారు.
హైదరాబాద్ గెజిట్ అమలుకు సర్కార్ ఆమోదం
మహారాష్ట్ర మంత్రి రాధాకృష్ణ విఖే పాటిల్ నేతృత్వంలోని సబ్ కమిటీ మంగళవారం, మరాఠా కోటా ఉద్యమం చేస్తున్న మనోజ్ జరాంగేను కలిసింది. ‘హైదరాబాద్ గెజిట్’ అమలుకు సర్కార్ ఆమోదం తెలిపినట్లు వెల్లడించింది. మరాఠా నిరసనకారులపై గతంలో దాఖలు చేసిన కేసులను ఈ సెప్టెంబర్ చివరికల్లా ఉపసంహరించుకుంటామని పేర్కొంది. నిరసనల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం చేస్తామని స్పష్టం చేసింది. విద్యార్హతల మేరకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని కూడా నిర్ణయించినట్లు చెప్పింది. అయితే కున్బీలు, మరాఠాలు ఒకే వర్గమని ఉత్తర్వులు జారీ చేసేందుకు కనీసం రెండు నెలల సమయం పడుతుందని మంత్రి రాధాకృష్ణ విఖే పాటిల్ చెప్పారు.