మహారాష్ట్రలోని హింగోలీ జిల్లాకు చెందిన ఒక ప్రభుత్వ ఉద్యోగి వాట్సాప్‌లో వచ్చిన నకిలీ వివాహ ఆహ్వానం కారణంగా రూ.1,90,000 నష్టపోయారు. ఈ సంఘటన ఆగస్టు 23, 2025న జాతీయ మీడియాలో వెలుగులోకి వచ్చింది.
స్కామ్ ఎలా జరిగింది?
ఆగస్టు 30, 2025న వివాహం జరుగుతుందని తెలియజేస్తూ, బాధితుడికి వాట్సాప్‌లో ఒక సందేశం వచ్చింది. సందేశంలో, “పెళ్లికి తప్పక రండి. ఆనందం అనే గేట్లు తెరిచే కీ ప్రేమ” అని రాసి, ఒక వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డ్‌గా కనిపించే ఫైల్‌ను జతచేశారు. అయితే, ఈ ఫైల్ ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్ ప్యాకేజీ (APK) రూపంలో ఉంది. ఇది పీడీఎఫ్‌గా మారు రూపంలో వుంది. బాధితుడు ఆ ఫైల్‌ను క్లిక్ చేయగానే, సైబర్ నేరగాళ్లు అతని ఫోన్లోని డేటాను యాక్సెస్ చేసి, బ్యాంకు ఖాతా నుంచి రూ.1,90,000 స్వాహా చేశారు.
ఈ ఘటన తెలిసిన వెంటనే బాధితుడు హింగోలీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం సైబర్ క్రైమ్ విభాగం ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. ఈ విధమైన స్కామ్ గత ఏడాది కూడా వెలుగులోకి వచ్చింది, ఇందులో చాలామంది తమ డబ్బును కోల్పోయారు.
స్కామ్ ఎలా పనిచేస్తుంది?
సైబర్ నేరగాళ్లు గుర్తుతెలియని నంబర్ల నుంచి వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా నకిలీ వివాహ ఆహ్వానాలు, డాక్యుమెంట్లు, వీడియోలు లేదా లింకులను పంపిస్తారు. ఈ ఫైళ్లను ఆసక్తితో క్లిక్ చేస్తే, APK ఫైల్ రూపంలో ఉన్న మాల్వేర్ ఫోన్లో డౌన్లోడ్ అవుతుంది. ఈ మాల్వేర్ ఫోన్లోని గ్యాలరీ, యాప్‌లు, బ్యాంకు వివరాలతో సహా అన్ని అనుమతులను స్వయంచాలకంగా తీసుకుంటుంది. ఫలితంగా, ఫోన్ హ్యాక్ అయి, నేరగాళ్లు బ్యాంకు ఖాతాల నుంచి డబ్బు బదిలీ చేసుకోవడంతో పాటు, వ్యక్తిగత ఫొటోలు, సమాచారాన్ని సేకరించి బెదిరింపులకు దిగే అవకాశం ఉంది.
సైబర్ నిపుణులు ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు:
ఫైల్ రకం తనిఖీ: వచ్చిన ఫైల్ పేరు చివరిలోని అక్షరాలను పరిశీలించండి. ఉదాహరణకు, ‘.pdf’ అయితే సురక్షితం, కానీ ‘.apk’ అయితే డౌన్లోడ్ చేయవద్దు.
తెలిసిన వారి నుంచి వచ్చిన సందేశాలు: తెలిసిన వ్యక్తుల నుంచి వచ్చిన ఫైళ్లను కూడా ఒకసారి పరిశీలించిన తర్వాతే తెరవండి.
మాల్వేర్ హెచ్చరికలు: APK ఫైళ్లను క్లిక్ చేసినప్పుడు ఫోన్లో ప్రమాదకర ఫైల్‌గా హెచ్చరికలు వస్తే, వాటిని డౌన్లోడ్ చేయకండి.
అపరిచిత లింకులు: గుర్తుతెలియని నంబర్ల నుంచి వచ్చిన లింకులు, ఫైళ్లను తెరవకుండా ఉండండి.
ఏం చేయాలి?
మీరు ఇలాంటి స్కామ్‌కు గురైతే:
వెంటనే ఫోన్‌ను ఎయిర్‌ప్లేన్ మోడ్‌లోకి మార్చి ఇంటర్నెట్ డిస్కనెక్ట్ చేయండి.
బ్యాంకుకు సమాచారం ఇచ్చి ఖాతాను ఫ్రీజ్ చేయండి.
నేషనల్ సైబర్ హెల్ప్‌లైన్ 1930కు ఫోన్ చేయండి.
నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేయండి.
సమీప సైబర్ పోలీస్ స్టేషన్లో స్క్రీన్షాట్లు, ఎస్ఎంఎస్ అలర్ట్‌లతో ఫిర్యాదు చేయండి.
ఈ స్కామ్‌లు ముఖ్యంగా వివాహ సీజన్లో ఎక్కువగా జరుగుతాయని, అందుకే అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. గతంలో హిమాచల్ ప్రదేశ్ సైబర్ పోలీస్ ఈ తరహా స్కామ్‌ల గురించి హెచ్చరికలు జారీ చేశారు.


