ఒక అమ్మాయి పెళ్లి తరువాత అత్తగారింటికి వెళ్ళి ఇంట్లోవాళ్ళతో సర్దుకుపోవాలి, ఇంట్లోవాళ్లకు సేవ చేయాలి, అణిగిమణిగి ఉండాలి, తల్లిగారింటికి చెడ్డపేరు తీసుకురాకూడదు. అమ్మాయి బతుకయినా చావయినా అత్తగారింట్లోనే అనే మాటలు మెజారిటీ మనుషులకు వినసొంపుగా చాలా బాగుంటాయి కదా!
అసలు అమ్మాయి పెళ్లి తరువాత అత్తగారింటికి ఎందుకు వెళ్ళాలి అనే ఆలోచన ఎప్పుడూ రాలేదా? పెళ్లి అమ్మాయికి మాత్రమే అవసరమా? అబ్బాయికి పెళ్లి అవసరం లేదా? ఇద్దరికి అవసరం అయినప్పుడు, ఇద్దరు పెళ్లి (Marriage) చేసుకొని సొంతంగా కలిసి ఉండే ఏర్పాట్లు ఎందుకు ఉండకూడదు అనే ఆలోచన రాలేదా? ఇలా అంటే అబ్బాయిని విడదీసినట్లు, కుటుంబాన్ని నాశనం చేసినట్లు అవుతుందా? మరి అమ్మాయిని కుటుంబం నుండి విడదీయడం లేదా? అమ్మాయిని తల్లితండ్రులు కని, పెంచి పెద్దచేయకుండా అమెజాన్ లో ఆర్డర్ పెట్టి తెప్పించారా? ఇలా అంటే సంస్కృతిని నాశనం చేసినట్లా? కుటుంబ వ్యవస్థ అంతరించి పోతుందా?
కేవలం వ్యవసాయం ఆధారంగా మనుషులు జీవించే రోజుల్లో ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ ఇది. ఆడవాళ్ళకు చదువు లేకుండా, కేవలం పిల్లలను కనటానికి ఇంట్లో ఉండి పనిచేయటానికి మాత్రమే అని ఆలోచించే రోజుల్లో ఉన్న సంస్కృతి ఇది. అలాంటిది ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలతో పాటు చదువుకుంటున్నారు, వాళ్లతో సమానంగా సంపాదిస్తున్నారు.
అమ్మాయి తల్లిదండ్రులు వదిలేసి, అత్తగారింటికి వచ్చి భర్తను సుఖపెడుతూ, పిల్లలను కంటూ, పని చేయటానికి ఆమె ఏమైనా బానిసా? ఆమె కూడా మగవాళ్ళలా ఒక మనిషే కదా! అబ్బాయికి అమ్మాయి ఎంత అవసరమో, అమ్మాయికి అబ్బాయి అంతే అవసరం. అమ్మాయికి ఇష్టం ఉంటె ఉండనివ్వండి, లేదంటే వేరుగా ఇద్దరు జీవించే విధంగా చూడండి.
ఈమధ్య ఆడపిల్లలు బరితెగించారు, పెళ్లిళ్లు చేసుకోవడం లేదు, రకరకాల కండిషన్స్ పెడుతున్నారు అంటూ వాపోతున్నారు కదా! ఇప్పుడిప్పుడే కదా వాళ్ళకి స్వేచ్ఛ, స్వాతంత్య్రం వచ్చింది. ఈ మాత్రం తట్టుకోలేకపోతే ఎలా? ఎన్నో ఏళ్లుగా వాళ్ళు పడిన బాధలు, కష్టాలు, కన్నీళ్లు అన్ని మరచిపోతే ఎలా? అణిగిమణిగి ఉంటే ఎలాంటి ఇబ్బంది లేదు, ఎందుకు అని ఓ చిన్నమాట అడిగితే బరితెగించారు అనే ముద్ర వేస్తున్నారు.
అత్తమామలతో కలిసి ఉండాలా, లేదంటే భర్తతో కలిసి వేరుగా ఉండాలా అనే అవకాశం అమ్మాయికి ఇవ్వండి. అమ్మాయిలు అత్తమామలతో, భర్తతో కలిసి జీవిస్తాం అంటే సంతోషం.. అది వాళ్ళ ఇష్టం. అలా కాకుండా మేము సెపరేట్ గా ఉంటాం అంటే వాళ్ళను నిందించకుండా వాళ్ళ మాటకు విలువ ఇవ్వండి. బలవంతంగా ఇంట్లో ఉండాలి అనే ఆలోచనను వదిలెయ్యండి.
అమ్మాయిలు మరింత చదవండి. ఉన్నత చదువులు చదవండి. ఆర్థికంగా సొంతంగా ఎదగండి. భర్తకు ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నా, మీరు సంపాదించడం ఆపకండి. పెళ్ళికి తొందరపడవద్దు. అమ్మానాన్నలను ఒప్పించండి. మానసికంగా శారీరకంగా పెళ్ళికి సిద్ధం అయిన తరువాతనే పెళ్లి చేసుకోండి. మార్పు మొదలయింది మరింత ఆత్మవిశ్వాసంతో ముందడుగు వెయ్యండి.
~ కవీందర్ రెడ్డి