నగర శివార్లలోని ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)పై సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాజేంద్రనగర్ సమీపంలో ఒకదాని వెనుక ఒకటి ఏకంగా తొమ్మిది కార్లు ఢీకొనడంతో భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనలో పలువురు గాయపడినట్లు సమాచారం.
పూర్తి వివరాల్లోకి వెళితే… సోమవారం ఉదయం ఓఆర్‌ఆర్‌పై ఓ కారు అతివేగంగా ప్రయాణిస్తోంది. రాజేంద్రనగర్ వద్దకు రాగానే ఆ కారు డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేశారు. దీంతో దాని వెనుక వేగంగా వస్తున్న మిగతా కార్లు ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. ఈ వరుస ప్రమాదంలో మొత్తం తొమ్మిది కార్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. క్షణాల వ్యవధిలో జరిగిన ఈ ఘటనతో వాహనదారులు భయాందోళనకు గురయ్యారు.
ప్రమాదం కారణంగా కార్లన్నీ రోడ్డుకు అడ్డంగా నిలిచిపోవడంతో ఓఆర్‌ఆర్‌పై సుమారు రెండు కిలోమీటర్ల పొడవునా వాహనాలు నిలిచిపోయాయి. ఉదయం పూట కార్యాలయాలకు, ఇతర పనులకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఓఆర్ఆర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు.
క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం క్రేన్ల సహాయంతో ప్రమాదానికి గురైన కార్లను రోడ్డుపై నుంచి పక్కకు తొలగించి, ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి కచ్చితమైన కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు.