పఠాన్‌చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి కెమికల్స్ పరిశ్రమలో ఇవాళ (సోమవారం) భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 12 మంది మృతిచెందగా.. మరో 15 మందికిపైగా తీవ్రగాయాలు అయ్యాయి. బాధితులను వెంటనే పలు ఆస్పత్రులకి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు పరిశ్రమలో మంటలు ఎగసిపడుతున్నాయి. పేలుడు ధాటికి కార్మికులు ఎగిరిపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని అధికారులు చెబుతున్నారు. పలువురు కార్మికులు మంటల్లో చిక్కుకున్నారు. మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. రియాక్టర్ పేలడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
ఈ ప్రమాదంతో స్థానికులు, కార్మికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సిగాచి కెమికల్స్ ఫ్యాక్టరీ పరిసరాల్లో దట్టమైన పొగ అలుముకుంది. ఘాటైన వాసనతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో చుట్టుపక్కల వారిని అధికారులు ఖాళీ చేయించారు. ఘటనాస్థలికి ఎవరూ రావొద్దని అధికారులు సూచించారు. పేలుడు ధాటికి పరిశ్రమ భవనం కుప్పకూలాగా, మరో భవనానికి బీటలు పడ్డాయి. ఫ్యాక్టరీలో ఒడిశా, ఇతర రాష్ట్రాల కార్మికులు పనిచేస్తున్నారు. వారినీ అక్కడి నుంచి దూరంగా పంపించి వేస్తున్నారు. పోలీసులతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, హైడ్రా, రెవెన్యూ అధికారులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. సహాయ చర్యలను ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. సంఘటన స్థలానికి మంత్రులు దామోదర రాజనర్సింహ, వివేక్ వెంకటస్వామి, పఠాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మల్టీజోన్-2 ఐజీ సత్యనారాయణ, ఎస్పీ పరితోష్ పంకజ్ చేరుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం జరిగి కార్మికులు అందులో చిక్కుకోవడం అత్యంత విషాదకరమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు అన్నారు. కార్మికులు, సిబ్బందిని కాపాడేందుకు అవసరమైన అన్నిచర్యలు వెంటనే చేపట్టాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని మాజీ మంత్రి హరీష్‌రావు కోరారు.
పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో పేలుడు సంభవించిందని మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. భూమి కంపించేంత శబ్దం వచ్చిందని చెప్పుకొచ్చారు. 149మంది వరకు ఈ పరిశ్రమలో ఉదయం పని చేశారని వెల్లడించారు. ఈ ప్రమాదంలో నాలుగు అంతస్థుల భవనం కుప్పకూలిందని.. 8మంది చనిపోయారని అన్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలిపారు. బిహార్, చత్తీస్‌ఘడ్‌తోపాటు తెలుగు వాళ్లూ ఈ పరిశ్రమలో పనిచేస్తున్నారని వెల్లడించారు. పరిశ్రమలో పనిచేసే వారి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారని మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు.