తెలంగాణ ఆర్టీసీ సంస్థలో మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. వికారాబాద్ జిల్లాలోని పరిగి బస్ డిపోలో వాహనాల ఇంజన్, ఛాసిస్ నంబర్ల ట్యాంపరింగ్ జరిగింది. ఈ వ్యవహారం స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ మోసం ఆర్టీసీ సంస్థ ప్రతిష్టను దెబ్బతీసింది. గత సంవత్సరం అక్టోబర్‌లో సరైన పత్రాలు లేవని ఓ బోరుబండిని పోలీసులు సీజ్ చేశారు. పోలీసులు, రవాణా శాఖ అధికారులు సంయుక్తంగా విచారణ చేసి వాహన యజమానిపై కేసు నమోదు చేశారు.
బోరుబండిని సెక్యురిటీ కోసం పోలీసులు పరిగి బస్ డిపోలో ఉంచారు. అయితే ఆర్టీసీ సిబ్బందికి కాసుల ఆశ చూపి గుట్టుచప్పుడు కాకుండా వాహన ఇంజన్ నంబర్, చేసిస్ నంబర్‌ను సదరు యజమాని మార్చివేశాడు. మార్చిన నంబర్ల ఆధారంగా కోర్టును తప్పుదోవ పట్టించి పోలీసులకు బండి రిలీజ్ ఆర్డర్ పంపినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో పోలీసులు, ఆర్టీసీ డిపో మేనేజర్ దాట వేసే ధోరణిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయం బయటకు చెప్పడానికి రెండు శాఖల అధికారులు జంకుతున్నారు. అయితే ఈ ట్యాంపరింగ్ వ్యవహారం ఆర్టీసీ ఉన్నతాధికారులకు, ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు చేరింది. ఈ వ్యవహారంలో పోలీసుల తీరు పలు అనుమానాలకు తావిస్తోంది.