విశాఖ జిల్లా భీమిలి మండలం తగరపువలస పరిధిలోని సంగివలస ఎన్నారై వైద్య కళాశాల విద్యార్థి ప్రణీత్ శిరం (24) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాను చదువుతున్న కళాశాల భవనం నాల్గవ అంతస్తు మీద నుంచి కిందకి దూకి బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు. సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతున్న సమయంలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది.
విజయవాడకి చెందిన రాజేశ్వరరావు ఏకైక కుమారుడైన ప్రణీత్ 2019లో యాజమాన్య కోటాలో ఎంబీబీఎస్ లో చేరాడు. కరోనా సమయంలో తలెత్తిన ఇబ్బందుల కారణంగా చదువులో కొద్దిగా వెనుకబడి కొన్ని సబ్జెక్టులు తప్పుతూ వచ్చాడు. ఇప్పటికే ఇతడి బ్యాచ్ మేట్లు చదువు పూర్తిచేసుకున్నారు. Backlogs ఉండడంతో ప్రణీత్ ప్రస్తుతం MMBS final year part 2 చదువుతున్నాడు. ఈ క్రమంలో గత కొద్దిరోజులుగా సప్లిమెంటరీ పరీక్షలు రాస్తున్నాడు. శనివారం జరిగిన గైనిక్-1 పరీక్షకు స్లిప్పులు తెచ్చి చూసి రాస్తుండడంతో విధుల్లో ఉన్న ఇన్విజిలేటరు పట్టుకుని ఓఎంఆర్ షీటు తీసుకున్నారు. చీఫ్ ఎగ్జామినర్ గా వ్యవహరిస్తున్న శ్రీధర్రెడ్డికి, పరిశీలకులకు అప్పగించారు.
ఉదయం పది గంటలకు పరీక్ష ప్రారంభం కాగా, ఓ గంటసేపటిలోనే ఈ ఘటన జరిగింది. ప్రణీత్ ఎంత ప్రాధేయపడినా పరీక్ష రాసేందుకు వారు ఒప్పుకోకపోవడంతో పాటు పరీక్ష అయ్యే దాకా బయటికి పంపలేదు. దీంతో పరీక్ష హాలు పరిసరాల్లోనే అటూ ఇటూ తిరుగుతూ మధ్యాహ్నం ఒంటిగంట వరకూ ఉన్నాడు. పరీక్ష రాసి విద్యార్థులు బయటికి వస్తున్న సమయంలో ప్రణీత్ ఒక్కసారిగా ఎమర్జెన్సీ ద్వారం వైపు పరుగు తీయడంతో అక్కడే ఉన్న వైస్ ప్రిన్సిపల్ శ్రీధర్రెడ్డి కేకలు వేయడంతో విధుల్లో ఉన్న మహిళా సెక్యూరిటీ గార్డు ఆపేందుకు చేయిని పట్టుకున్నా కూడా బలవంతంగా విదిలించుకుని భవనం నాల్గో అంతస్తుపై నుంచి కింద దూకి అక్కడికక్కడే ప్రాణాలను వదిలాడు. తమ సహచరుడు మృతి చెందడంతో తోటి విద్యార్థులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు.