తమ భయాలకో, స్వార్ధాలకో పసిపిల్లల ఉసురు తీసే కన్నవారి దౌష్ట్యాలకు అంతు వుండటం లేదు. ఇటీవల సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ లో వెలుగు చూసిన ముగ్గురు చిన్నారుల హత్య కేసు కీలక మలుపు తిరిగింది. తన వివాహేతర సంబంధం కొనసాగటానికి, ప్రియుడిని పెళ్లి చేసుకోవడానికి పిల్లలు అడ్డుగా వున్నందున ఆ చిన్నారులను కన్నతల్లి రజితే చంపిందని పోలీసులు తేల్చారు. తన ముగ్గురు పిల్లలను తానే స్వయంగా గొంతు నులిమి చంపానని రజిత అంగీకరించిందని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఒకటో ముద్దాయి ఐన రజితని, రెండో ముద్దాయి ఐన ఆమె ప్రియుడు శివని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పి పరితోష్ పంకజ్ మీడియాకు కేసు వివరాలను వెల్లడించారు.
వివరాల్లోకి వెళితే: రజిత అలియాస్ లావణ్యకు ఇంటర్మీడియేట్ రెండో సంవత్సరం చదువుతున్న సమయం(2013)లో తన కన్నా 20 ఏళ్లు పెద్దవాడైన అవురిచింతల చెన్నయ్యతో వివాహం జరిగింది. వీరికి సాయికృష్ణ (12), మధుప్రియ (10), గౌతం (8) పిల్లలున్నారు. చెన్నయ్య వాటర్ టాంకర్ డ్రైవర్ గా, రజిత ప్రైవేట్ స్కూల్ టీచర్ గా పనిచేసేవారు. ఆరు నెలల క్రితం రజితకి తన పదో తరగతి క్లాస్మేట్, స్నేహితుడు ఐన శివతో స్నేహం మళ్లీ చిగురించింది. నిత్యం చాటింగ్, కాల్స్, వీడియోకాల్స్ మాట్లాడేవారు. చాలాసార్లు శారీరికంగా కూడా కలిశారు. రజిత చెన్నయ్య మధ్య 20 ఏళ్ల ఏజ్ గ్యాప్ వుండటంతో రజితకు చెన్నయ్య అంటే ఇష్టం వుండేది కాదు. తరుచూ గొడవలు పడేవారు.
శివ కలిసినప్పటి నుండి తన జీవితం ఆనందంగా వుందని, శివకు పెళ్లి కాకపోవడంతో ఎలాగైనా అతన్ని పెళ్లి చేసుకోవాలని ఆమె భావించి శివని అడిగితే ఒకవేళ రజితకి పెళ్లి అవకున్నా చేసుకునేవాడినని, కనీసం పిల్లలు లేకున్నా చేసుకునేవాడినని శివ ఆమెతో చెప్పడంతో ఎలాగైనా పిల్లల అడ్డు తొలగించుకోవాలని అనుకున్నది. ఈ క్రమంలోనే మార్చ్ 27న పిల్లల్ని చంపేస్తానని శివకు చెప్పింది. అదే రోజు రాత్రి భర్త చెన్నయ్య టాంకర్ తీసుకొని చందానగర్ వెళ్లిన సమయంలో ముగ్గురు పిల్లలను ఒకరి తరువాత ఒకరిని ఊపిరాడకుండా చేసి చంపేసింది.
తన స్వార్ధం కోసం, సుఖం కోసం కన్నతల్లే స్వయంగా తన చేతులతో తన కడుపున పుట్టిన బిడ్డల్ని హత్య చేసిన హృదయాన్ని కలిచేవేసే ఈ దారుణ సంఘటనని విశ్లేషిస్తే ఆమె తల్లిదండ్రులు, భర్త పరోక్ష హంతకులు అని తేలుతుంది. ఇంటర్మీడియేట్ చదివే అమ్మాయంటే బహుశా మైనారిటీ కూడా తీరని సమయంలో ఆమెకి తన కంటే ఇరవై ఏళ్లు పెద్దవాడైన చెన్నయ్యతో వివాహం చేసిన ఆమె తల్లిదండ్రులు కూడా దోషులే. తన కంటే ఇరవై ఏళ్ల చిన్నదైన అమ్మాయిని వివాహం చేసుకోవడమంటే ఆమె జీవితాన్ని నాశనం చేయడమనే ఇంగితం ఆమె భర్త చెన్నయ్యకు లేకపోవడం వల్ల అతనూ నిందితుడే. తన భర్త వల్ల, అతనితో కాపురం వల్ల ఆమెకి జీవితంలో మిగిలింది అసంతృప్తే. ఆ అసంతృప్తే ఆమెని కన్నబిడ్డల్ని చంపుకునేంత అమానుషంగా మార్చేసింది. పిల్లల్ని చంపడమంటే వారి అడ్డు తొలగించుకోవడమనే అనుకున్నదే కానీ చట్టం నుండి, అది వేసే శిక్ష నుండి తప్పించుకోవడం సాధ్యం కాదనే విచక్షణని కోల్పోయింది. చివరికి హంతకురాలై కటకటాల పాలయింది.
రజిత ఒక్కతే హంతకురాలందామా మరి?