మయన్మార్‌లో రంజాన్ శుక్రవారం సందర్భంగా ప్రార్థనలు చేస్తుండగా 700 మందికి పైగా సజీవ సమాధి అయ్యారు.
మయన్మార్‌లోని ముస్లీం ఆర్గనైజేషన్ సోమవారం వెల్లడించింది. మయన్మార్‌లో రెండవ అతి పెద్ద నగరమైన మాండలేలో రిక్టర్ స్కేల్‌పై 7.7 రీడింగ్‌తో పెను భూకంపం సంభవించడాన్ని మయన్మార్ అధికారులు వెల్లడించారు. ఈ విలయంలో వందల సంఖ్యలో భవనాలు నేలమట్టమయ్యాయి. 60కి పైగా మసీదులు తీవ్రంగా ధ్వంసమయ్యాయని ‘స్ప్రింగ్ రివల్యూషన్ మయన్మార్ నెట్‌వర్క్’ కమిటీ సభ్యుడు టున్ కీ తెలిపారు.
మధ్యాహ్న సమయంలో ప్రార్థనలు చేస్తున్నప్పుడే భూకంపం సంభవించడంతో 700 మందికి పైగా శిధిలాల కింద మరణించినట్లు ఆయన వెల్లడించారు. అయితే ఈ మరణాలను అధికారిక లెక్కలలో చేర్చారా లేదా అన్న విషయం స్పష్టత లేదు.
మయన్మార్ భూకంప విపత్తులో 1,700 మందికి పైగా మరణించినట్లు మిలటరీ ప్రభుత్వం ప్రకటించింది. మరో 3,400 మంది తీవ్రంగా గాయపడ్డారు. 300 మందికి పైగా వ్యక్తుల ఆచూకీ దొరకలేదు.
అంతర్యుద్ధంతో కుంగిపోతున్న మయన్మార్ ఈ ఘోర విపత్తుతో మరింత కకావికలమై పోయింది. భూకంపం కారణంగా కమ్యూనికేషన్ వ్యవస్థ తెగిపోవడం, రహదారులు, వంతెనలు దెబ్బతినడం, సహాయక చర్యలు కుంటుపడటం వంటి సమస్యలు ఏర్పడ్డాయి. మాండలే వీధుల్లోని భవనాల శిధిలాల కింద శవాలు కుళ్లిపోవడంతో దుర్గంధం వ్యాప్తి చెందుతోంది.
ఈ విపత్తు సందర్భంగా పొరుగు దేశమైన భారత్ సహాయం అందించింది. 15 టన్నుల సహాయక సామాగ్రిని తక్షణ సాయంగా పంపింది. 60 మంది NDRF సిబ్బందిని కూడా మయన్మార్‌కు పంపింది.