అమెరికా ప్రేమికులకు హెచ్-1బీ వీసాకు నమ్మకమైన ప్రత్యామ్నాయంగా ఓ-1 వీసా మారింది. ఎస్‌టీఈఎం, వ్యాపారం, కళలు, క్రీడలు వంటి రంగాల్లో అసాధారణ ప్రతిభావంతుల కోసం ఈ వీసాను అమెరికన్ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది లాటరీ లేని హెచ్-1బీ వీసాగా పేరు పొందింది. దీనిపై భారతీయులు ఆసక్తి చూపిస్తున్నారు. టాప్ కంపెనీలు కూడా ఈ వీసా ద్వారా నిపుణులను ఉద్యోగులుగా నియమించుకొనేందుకు ముందుకొస్తున్నాయి.
ఏమిటి ఈ ఓ-1 వీసా?
దీనిని ఇమిగ్రేషన్ చట్టం, 1990 ప్రకారం ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. గొప్ప పురస్కారాలు, స్కాలర్లీ పబ్లికేషన్స్, తమ రంగంలో ఒరిజినల్ కంట్రిబ్యూషన్స్ వంటి ఎనిమిది కఠినమైన ప్రమాణాలను నిర్దేశించింది. అభ్యర్థి వీటిలో కనీసం మూడింటిని సాధించి ఉండాలి. అయితే, చెప్పుకోదగ్గ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవి ఏమిటంటే, వార్షిక లాటరీ కాని, పరిమితులు కాని లేవు. 93 శాతం అప్రూవల్ రేటు ఉంది. మూడేళ్ల వరకు చెల్లుబాటు ఉంది, గడువును పొడిగించుకునే అవకాశాలు అపరిమితం.
హెచ్-1బీ వీసాకు విపరీతమైన తనిఖీలు, పరీక్షలు ఎదురవుతున్నాయి. అప్రూవల్ రేటు 37 శాతమే. అదే ఓ-1 వీసా ద్వారా అయితే అత్యధిక నైపుణ్యంగల ప్రతిభావంతులు వ్యవస్థాగత అనిశ్చితిని అధిగమించొచ్చు. అందుకే ఇది ఆకర్షణీయంగా మారింది. అమెరికన్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ డేటా ప్రకారం.. 2020 ఆర్థిక సంవత్సరంలో 8,838 ఓ-1ఏ వీసాలు జారీ కాగా, 2023 ఆర్థిక సంవత్సరంలో 18,994 జారీ అయ్యాయి. వీటిని పొందినవారిలో బ్రిటన్, బ్రెజిల్ తర్వాతి స్థానంలో భారతీయులు ఉన్నారు. భారతీయులకు 1,418 ఓ-1ఏ వీసాలు వచ్చాయి. 2020 ఆర్థిక సంవత్సరంలో 487 ఓ-1ఏ వీసాలు భారతీయులకు లభించాయి, అంటే, 191 శాతం పెరుగుదల నమోదైంది. ఎస్‌టీఈఎం గ్రాడ్యుయేట్లు, ఏఐ రీసెర్చర్స్, ఎంటర్‌ప్రెన్యూవర్స్, కళాకారులు ఈ సదుపాయాన్ని వినియోగించుకున్నారు.
ఓ-1 ట్యాలెంట్‌ను చురుగ్గా స్పాన్సర్ చేస్తున్న ప్రధాన అమెరికన్ సంస్థల్లో గూగుల్, టెస్లా, మెక్‌కిన్సే వంటివి ఉన్నాయి. అదేవిధంగా హార్వర్డ్, యేల్ వంటి విశ్వవిద్యాలయాలు భారతీయ ఫ్యాకల్టీని ఈ వీసాల ద్వారా నియమించుకుంటున్నాయి. కృత్రిమ మేధ (ఏఐ) బూమ్ వల్ల ఈ వీసాలకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఓ-1 వీసా దరఖాస్తుదారులు తమ పరిశోధనను ప్రచురించాలని, సమావేశాల్లో ప్రసంగించాలని, లేదా, పేటెంట్లను దాఖలు చేయాలని, ఇలా చేయడం వల్ల దరఖాస్తులకు ఆమోదం లభించే అవకాశాలు పెరుగుతాయని కంపెనీలు సలహా ఇస్తున్నాయి. ఉదాహరణకు, ‘ది క్యూరియస్ మావరిక్’ అనే విద్యా సంస్థను స్థాపించిన సౌందర్య బాలసుబ్రమణి (28)కి ఓ-1ఏ వీసా వచ్చింది. దీనిని బట్టి సంప్రదాయ ఉపాధికి భిన్నంగా ఈ వీసా అందుబాటులో ఉన్నదనే విషయం తేటతెల్లమవుతున్నది.
హెచ్-1బీ ఫీజు కన్నా 10 రెట్లు ఎక్కువగా అంటే 10,000 డాలర్ల నుంచి 30,000 డాలర్ల వరకు ఓ-1 వీసా పొందడానికి ఖర్చవుతుంది. అయినప్పటికీ ఈ వీసా కోసం అత్యధికంగా పెట్టుబడి పెడుతున్నారు. వీటికి పెరుగుతున్న డిమాండ్ వల్ల తమ క్లయింట్ రోస్టర్స్ 60 నుంచి 300కు పెరిగినట్లు జినీ గ్రీన్ కార్డ్ వంటి ఇమిగ్రేషన్ ఫర్మ్స్ చెప్తున్నాయి. ముఖ్యంగా, హెచ్-1బీ లాటరీలో తిరస్కరణకు గురైన భారతీయులు ఓ-1 కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిపాయి. ఓ-1ఏ వీసాలు ఏటా 10 శాతం చొప్పున పెరుగుతున్నాయి. కనీస జీతం, ఫార్మల్ డిగ్రీ వంటివేవీ అవసరం లేకపోవడం, అంతర్జాతీయ పురస్కారాలు లేదా మీడియా కవరేజ్ వంటివాటిని సాక్ష్యాలుగా అంగీకరించడం, అతి తక్కువగా 10 రోజుల్లోనే పిటిషన్లను ప్రాసెస్ చేయడం వంటి ఆకర్షణలు ఉత్తమ భారతీయ ప్రొఫెషనల్స్‌కు, అదేవిధంగా, కంపెనీలకు ఓ-1 వీసా ప్రయోజనకరంగా మారింది.