Tuesday, 17 March 2026

ఇండియన్ వాషింగ్టన్ కార్వర్: మామిడాల రాములు

అవి అమెరికన్ సమాజంలో బానిసలను బహిరంగ మార్కెట్లో సంతలో పశువులను అమ్ముతున్న దశ, నాడు పెల్లుబుకుతున్న విప్లవ సెగలు, బానిసల తిరుగుబాటు, దొంగలదాడులు ప్రతిదాడులతో అంతర్యుద్ధంతో సతమతం అవుతున్న సంక్షుభిత కాలంలో అమెరికా న్యూటన్ కౌంటీ సమీప మిస్సోరీలో ‘మేరీ’ మరియు ‘గిల్’ అనే నల్లజాతి బానిస జంటను ‘మోజెస్ కార్వర్’ అనే జర్మన్ శ్వేత జాతీయుడు సంతలో కొన్నాడు. ఆ జంటకు ఐదుగురు సంతానం. ఒక రోజు ఎక్కడి నుండి వచ్చారో ఒక పెద్ద గుంపు మోజెస్ కార్వర్ ఇంటిమీద దాడి చేసి అక్కడి బానిసలను తోలుకొని పోయారు. ఆ అంతర్యుద్దం లో చిన్నాభిన్నం అయిన ‘మేరీ’ కి ఐదుగురు సంతానం. భర్త పిల్లలు ఎక్కడున్నారో తెలియదు. కానీ ఒక రెండు వారాల పసిగుడ్డు మాత్రం యజమాని దగ్గరే చావు బ్రతుకుల మధ్య మిగిలిపోయాడు. అన్నీ పోయిన ఆ యజమాని చివరి దశలో ఆ పసిబాలుడే తనకు వ్యాపకం అయ్యాడు. వాణ్ని సాకి సంక నేసుకొని తిరిగాడు. నూట అరవై ఏళ్ళ కింద ముచ్చట. బానిస వ్యతిరేక చట్టం అమలు అయినా నల్ల జాతీయుల మీద నిర్భంధం వివక్ష మాత్రం తగ్గలేదు. తనకు సమీపంలో నల్లవాళ్ళకు మాత్రమే ఉండే బడులు లేవు. అలా ఒక సంచారిలా దేశ దిమ్మరిలా బయటపడిన ఆ బాలుడు. సమీప బడుల్లో ఇళ్ళలో పాచి పనులు చేస్తూ ఒక లాండ్రీ షాప్ పెట్టుకొని బట్టలు ఉతుకుతూ వివక్షల మధ్య బ్రతుకు యుద్ధం చేసాడు. నాటి అంతర్యుద్దం లో తండ్రి చనిపోయాడు. తల్లి ఎక్కడుందో తెలియదు కాకుంటే తన తల్లిని కొన్న ఆధారం ఒక రసీదు మినహా. ఆ రసీదు సహాయంతో తన మూలాల వెతుకులాట మొదలు పెట్టాడు. రెండు వారాల పసిగుడ్డుగా మిగిలిన ఆ బాలుడు తన రక్త భందువుల కోసం ఎంత వగచాడో.

తన యజమాని సహకారంతో కోల్పోయిన తన అన్న ‘జార్జ్’ ని తల్లిని ఇద్దరు అక్కలు అన్నలను కలుసుకుంటాడు. అలా మొదలైన తన ప్రయాణం ఒక పేరుమోసిన శాస్త్రవేత్తగా మార్చింది. అతనే ప్రసిద్ద వ్యవసాయ శాస్త్రవేత్త జార్జ్ వాషింగ్టన్ కార్వర్. పెంచిన యజమాని, తన అన్న పేరు వచ్చేలా యజమాని పెట్టిన పేరు అది. అలబామాలో ‘టస్క్ గీ’ విశ్వవిద్యాలయంలో తొలి ఆఫ్రో అమెరికన్ బొటనిస్ట్ గా శాస్త్రవేత్తగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచాడు. వ్యసాయ రంగంలో పంట మార్పిడీ పద్ధతి ముఖ్యంగా వేరుసెనగ పంట మీద ఆయన చేసిన పరిశోదనలు విశ్వవ్యాప్తం అయ్యాయి. వేరుశనగ పంటతో నూట ఇరవై ఒక రకాల ఉపయోగాలు ప్రపంచానికి చెప్పినవాడు. ఇవ్వాళ మనం తింటున్న ప్రతి వేరుశనగ గింజ మీద కార్వర్ పేరు ఉంటాది. ఎందుకు అంటే అది ప్రపంచానికి పరిచయం చేసినవాడు ఒక బానిస కొడుకు. ఆయన పేరుమీద ఎన్నో విద్యాసంస్థలు ఉన్నాయి. సెయింట్ లూయిస్ లోని మిస్సోరి బొటానికల్ గార్డెన్ లో ఆయన విగ్రహం ఇప్పటికీ ఉంది. నాడు అమెరికా బానిస సమాజం అయినా యజమానులు బానిసలకు చదివే ఆలోచించే వెసులు బాటు కల్పించారు. ఒక బానిస కొడుకు ఒబామా అమెరికా అధ్యక్షుడు కాగలిగాడు. మండేలా,మార్టిన్ లూథర్ లాంటివాళ్ళు ప్రపంచ స్వాభిమాన ఉద్యమాలకు దిక్సూచిలా మారారు.

ఒక నల్లజాతి బానిస అనుభవించిన వివక్ష అన్ని వివక్షల కన్నా కష్టమయినది అని చెప్పవచ్చు. ప్రపంచంలో ఏ రెండు సుఖపడ్డ, కష్ట పడ్డ సంసారాలూ ఒకే రకంగా ఉండవు అన్నాడు టాల్ స్టాయ్ . కానీ ఆఫ్రో అమెరికన్ బానిస వ్వాషింగ్టన్ కార్వర్ లా గెలుపు పోరులో బట్టలు ఉతికిన చేతులే చరిత్రను తిరగ రాస్తాయని ఒక తెలంగాణ బహుజనుడు నిరూపించాడు కాకుంటే లోకానికి తెలియదు అతనే మామిడాల రాములు. యాదృచ్ఛికం కాదు ఈ ఇద్దరు ప్రపంచ విజేతలూ ఒకరు జాతి మరొకరు కుల వివక్షను ఎదుర్కొన్న వారే. ఏ గడ్డమీద వలస బానిసగా పుట్టి పెరిగి గెలిచి ఒడాడో. అదే గడ్డమీద ప్రవాసిగా ఒక తెలంగాణ బహుజనుడు నిలబడడం చారిత్రకం. కార్వర్ సాదించిన విజయాలు అందునా ఒక ఆనాద బానిస ప్రస్తానం ఎక్కడ ముగిసిందో అక్కడే తెలంగాణ పెత్తందారీతనానికీ, పీడనకూ ఆకలి అవమానాల మధ్య నలిగిన మరొక తెలంగాణ కార్వర్ బయలుదేరాడు అతనే మామిడాల రాములు అలియాస్ అమెరికా రాములు.

వరంగల్ జిల్లా తరిగొప్పుల గ్రామంలో పందొమ్మిదివందల యాభైవ దశకంలో పుట్టిన ఆయన అత్యంత దుర్భర స్థితుల మధ్య పెరిగాడు. తెలంగాణలో తరిగొప్పుల పరిసర గ్రామాలు సాయుధ పోరాట క్షేత్రాలు. బైరాన్ పల్లి రుధిర క్షేత్రానికి కూతవేటు దూరంలో నాటి వరంగల్ జిల్లా తరిగొప్పుల గ్రామంలో మామిడాల సోమయ్య జీవితాన్ని దొరల గడీలలో వెట్టి బ్రతుకులు, పొద్దస్తమానం ఊరి చెరువులో సౌడుతో బట్టలు ఉతికి ఇంటికి ఒక ముద్ద వేస్తే తనువు గడిచి పోతున్న బ్రతుకుల్లోకి మామిడాల రాములు అనే ప్రపంచ పేరుగాంచిన మెకానికల్ ఇంజనీర్ పురుడు పోసుకున్నాడు. ఇంటికి ఇంత అన్నం అడిగి తెచ్చుకున్న చేతులే ప్రపంచంలో ఒక మెకానికల్ ఇంజనీర్ అందుకోవాల్సిన అన్ని అవార్డులూ రివార్డులూ ప్రపంచ పేరుమోసిన అన్ని విశ్వవిధ్యాల యాలలో మేధో చర్చలు అమెరికా అధ్యక్షుడి నుంచి అత్యున్నత పురస్కారాలు అందుకునేలా చేసిన ఒక విజేత కథ ఇది.

పందొమ్మిది వందల యాభయ్యో దశకంలో మొదలైన ఆయన ప్రస్తానం తరిగొప్పుల, బచ్చన్నపేట నర్మెట్ట, జనగామ ప్రభుత్వసాంఘీక సంక్షేమ పాఠశాల వసతులలేమి మధ్య గడిచిన బాల్యం ఒక వైపు. ఊరిలో దొరల ఆగడాలు మరో వైపు ‘నీ కెందుకురా చదువు నాలుగు గుడ్డలు ఉతికి బ్రతికేదానికి’ అనే ఈసడింపుల మధ్య పారాడిన బాల్యం ఆయనది. అటేడు ఇటేడు తరాలలో మొదట అక్షరం ముక్క నేర్చుకున్న మామిడాల రాములు. తండ్రి సోమయ్య పరమ శివభక్తుడు, చిన్న నిట్టాడి ఒక్క మంచం కూడా పట్టని ఇంట్లో పెద్ద పాముల పుట్ట అటువంటి అంధవిస్వాశాల మధ్య పెరిగిన బాల్యం రాములుది. ఏనాడూ ఇంట్లో పొయ్యిలో పిల్లి లేసేది కాదు. నిస్సారమైన బాల్యం, అగమ్యం అయిన దారి చుట్టూ కరుడుగట్టిన భూస్వామ్య క్రౌర్యం. అరవైలలో తెలంగాణ రూమీ టోపీ గాంధీ టోపీగా మారినా ప్రజల బ్రతుకుల్లో నిప్పులు మాత్రమే మిగిలాయి. బోయింగ్ లాంటి ఒక యుద్ద విమాన నిపుణుడు పురుడు పోసుకోవడం అంత తేలికగా జరగలేదు.

మిత్రుల చందాలతో చదువు ఉస్మానియా ఇంజనీరింగ్ కళాశాలదాకా సాగింది. ఆయన ఉస్మానియా ఇంజనీరింగ్ కళాశాలలో చేరేనాటికి జంపాల చంద్రశేఖర ప్రసాద సహచర్యం, తనలో ఏమూలనో దాగిన కవితా స్ఫూర్తి రగిలేలా చేసింది. జార్జ్ రెడ్డి అమరత్వం నెత్తుడి తడి ఆరలేదు, ఆయన మీద రాములు రాసిన స్మృతి కవితకు శ్రీశ్రీ ప్రశంస. సమకాలీన అంశాల మీద తన అసంతృప్తిని తన కవిత్వం ద్వారా వ్యాసాల ద్వారా తనలో రగిలిన కవిని మేల్కొలిపాడు. అమరుడు తారకం ముందు మాటతో ‘నిజామాబాద్ సాహితీ మిత్రుల’ పక్షాన ‘కాలం కదలికలతో’ అనే పుస్తకంలో చిత్రిక పట్టాడు. మరోవైపు తొలిదశ తెలంగాణ ఉద్యమ కల్లోల కాలంలోనే ఇంజినీరింగ్ చదువు. నిజానికి ఆయనని కదిలిస్తే తెలంగాణ కల్లోలాలు మరింతగా బయటకు వస్తాయి. ఐ.ఐ.టి డిల్లీ లో విద్య ముగించి ఉన్నత విద్య కోసం అమెరికాలో ప్రసిద్ద వాషింగ్టన్ యూనివర్సిటీలో పరిశోధన, ఒక బానిస కార్వర్ తిరుగాడిన నేలలోనే తెలంగాణ ఆకలి, కరువు, పెత్తందారీతనాల మధ్య చిద్రమైన వ్యక్తిత్వం మారుమొగ్గ వేస్తోంది. కేవలం పదిరూపాయల ఫీజు కోసం వెతుకాడిన బాల్యం దేశవిదేశాలలో పొందని పురస్కారాలు లేవు అంటే అతిశయోక్తి మాత్రం కాదు.

తెలంగాణ తొలిదశ ఉద్యమం ఊపందుకున్న కల్లోల దశలో ఉస్మానియా ఇంజనీరింగ్ కళాశాలలో మెకానికల్ ఇంజనీర్ గా పురాణా హవేలీ దారుల్ షఫా హాస్టల్లో బ్రతుకు పోరాటం చేసాడు. నల్లులు, ఆకలి, అవమానాలు, తెలంగాణ స్వాభిమాన పోరాటాల మధ్య కాసింత కవిత్వం మరికాస్త కసి కలగలిపిన బ్రతుకు. ఆకలి అవమానాలను జయించినవాడు ఆయన. కాలికి చెప్పుల కోసమూ వెతుకులాడిన తాను నర నరాన సంఘీక సంక్షేమ హాస్టల్ వితరణతో మాత్రమే చదువుకున్నా అని సగర్వంగా అంటాడు రాములు సర్. ఆకలి అవమానాలు దగ్గరకు వచ్చినా అపజయాన్ని మాత్రం ఎడమకాలితో తన్నాడు. తాను పుట్టి పెరిగిన నేల అసమ విలువలు ఆయనను ఎంతగానో కదిలించాయి. వీటి వెనక ఉన్న సోషల్ ఇంజనీరింగ్ లో లోపాలు ముందే పసిగట్టాడు. ఈ సమాజ అసమవిలువల ధ్వంసం కేవలం చదువు మాత్రమే మారుస్తాది అని నమ్మాడు. ఈ పనికి తనను ఎవరూ పురికొల్పలేదు అనీ ఏ సిద్దాంత రాద్దాంతాలూ తనను మార్చలేదు అని వినమ్రంగా అన్నా తన బ్రతుకు నావ నిరంతరం అన్వేషణ లోనే గడిచింది అనీ తాను నడిచి వచ్చిన దారిలో మానవీయంగా ఆదుకున్న చేతులను మాత్రం మరవలేను అంటాడు.

నాటి ఢిల్లీ ఐ.ఐ.టి. లో కేవలం పది సీట్లు మాత్రమె ఉండేవి, అందులో మెరిట్ లో మూడో స్థానంలో నిలిచి తన ప్రస్థానాన్ని దేశ రాజధానికి మార్చాడు. దేశం ఎమెర్జెన్సీ చీకటిలోకి వెళ్ళిన దశలో మాస్టర్స్ పూర్తి చేయనీకి రాజధానికి ఒక వైపు, మరోవైపు తన సహచరులు ప్రత్యామ్నాయ ఆలోచనలో కుటుంబాలను జీవితాలను ప్రయోగశాలగా మార్చుకుంటున్న దశలో తన చదువు లక్ష్యాన్ని మాత్రం వీడలేదు. అక్కడే పరిశోధనలో ఉండగానే అమెరికాలో పరిశోధన కోసం ప్రభుత్వ మెరిట్ స్కాలర్ షిప్ మీద ఆకలి అవమానాలు మోసుకొని అమెరికా ప్రయాణం అయ్యాడు. ‘ఆల్బెర్ట్ సి కోవయాస్కి’ అనే పేరుమోసిన విద్యావేత్త పర్యవేక్షణలో వాషింగ్టన్ యూనివర్సిటీ సియాటిల్ లో ‘డైనమిక్ క్రాక్ కర్వింగ్, క్రాక్ బ్రాంచింగ్’ లో పరిశోధన చేసాడు. ఎనభయ్యో దశక ప్రారంభ దినాలలో కోటి ఆశలతో బ్రతుకుదెరువు కోసం కన్న ఊరికి ప్రయాణం, సన్నగిల్లిన కొలువు ప్రయత్నాలు. అయినా చీకట్లో పారేసుకొని వెలుగుని వెలుతుర్లో వెతుక్కోవడం అవివేకం అనిభవించి మళ్ళీ అమెరికా తిరుగుప్రయాణం అయ్యాడు.

శాస్త్ర సాంకేతిక రంగాలలో మానవీయ శాస్త్ర పరిశోధనలో ఐరోపా అమెరికా సమాజాలకూ మూడో ప్రపంచ దేశాలకూ పూడ్చ లేనంత అఘాతం ఉంది. అది మన దగ్గర ఊరుకూ వాడకూ మధ్య ఉన్న సాంస్కృతిక దాష్టీకం అంత. అమెరికాలో ఉన్నత విద్య ముగించాక రాములు నిజాయితీగా తాను పుట్టిన ప్రాంతం లో కొలువు కోసం ప్రయత్నం చేసినవాడే. ఏ అవరోధాలు ఆయనను ఇక్కడ ఇమిడేలా చేయలేదో అనే చర్చకన్నా ఆయన తాను పరాయి దేశంలో ప్రపంచ విజేత కాగలిగాడు అనేది జగమెరిగిన సత్యం. తాను చేసిన పరిశోధనలు సాదించిన విజయాలు ఒక్కొక్కటిగా రాస్తే ఒక గ్రంధమే అవుతాది. స్వతహాగా రెండు గ్రాడ్యుయేట్ మరియు కంపోసిట్ మెటిరియల్స్ డిప్లమా కోర్సులను అందిస్తూ, వైమానిక నిపుణుడుగా ప్రపంచ ప్రసిద్దిగాంచిన ఆయన దాదాపు ఇదు వందలకు పైగా అంతర్జాతీయ స్థాయి పరిశోధనా పత్రాలు రెండు వందలకు పైగా గ్రాడ్యుఏట్ విద్యార్ధులకు మార్గ నిర్దేశకత్వం చేయడం అరుదయిన విషయం.

ప్రపంచాన్ని శాసించిన యూరో సెంట్రిక్ ఆలోచన చట్రంలోకి దక్షిణ ఆసియా దేశాల నుండి కనీస ప్రాతినిధ్యం కూడా లేదు. ఒక రకంగా గణితం లో రామానుజన్, ఇంజనీరింగ్ లో ఒక్క మామిడాల రాములు మాత్రమె కనిపిస్తున్నారు. దానికి ప్రత్యక్ష సాక్షం యూనివర్సిటీ అఫ్ వాషింగ్టన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఈనాటికీ అప్రతిహతంగా కొనసాగుతున్న ఆయన పరంపర. అమెరికా వెస్ట్ కోస్ట్ లో అతి ప్రాచీనమైన విశ్వవిద్యాలయాలలో యూనివర్సిటీ అఫ్ వాషింగ్టన్ ఒకటి. అటువంటి విశ్వవిద్యాలయంలో చేరిన ఆరేళ్ళకే ‘ప్రెసిడెన్షియల్ యంగ్ ఇన్వెస్టిగేటర్’ అవార్డుతో బాటు, అక్కడ పనిచేస్తున్న అత్యుత్తమ అధ్యాపకులలో ఒకడిగా గుర్తింపు పొందాడు. మొత్తం విశ్వవిద్యాలయం లోనే అత్యంత ప్రభావవంతమైన అధ్యాపకుడిగా, వందలాది పురస్కారాలు, వేలాది సెమినార్లు, అసంఖ్యాకంగా ఆయన పరిశోధనా అంశాలు ప్రాసంగికత నిలబెట్టుకోవడం ఆయన సాధించిన విజయాలలో ఒకటి. ఒకరకంగా అమెరికన్ సమాజంలో ముఖ్యంగా మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో ఒక ట్రెండ్ సెట్టర్ గా మిగిలిన అధ్యాపకుడి శ్రమ మనం అనుకున్నంత తేలికగా లభించలేదు. ప్రపంచంలో అనేక పేరుమోసిన విశ్వవిద్యాలయాలలో విజిటింగ్ ఫెలో గా, అనేక దేశాల శాస్త్ర సాంకేతిక సలహాదారునిగా ముఖ్యంగా ప్రతిష్టాత్మక బోయింగ్ పెన్నేల్ ఆచార్యుడుగా ఈ నాటికీ పనిచేయడం అరుదైనది. ఎయిర్ క్రాఫ్ట్ విమాన నమూనాలో ఆరితేరిన ఆయన ఆరేడు ప్రఖ్యాత జర్నల్స్ వ్యవస్థాపకుడిగా, అమెరికన్ సొసైటీ అఫ్ మెకానికల్ ఇంజనీర్స్ ఫెలోగా, మెకనికల్ ఇంజనీరింగ్ విభాగం జీవన సాఫల్య పురస్కారం తో బాటు ప్రపంచ వ్యాప్తంగా ఆయన చేసిన పరిశోధనల ప్రాసంగికత ఇప్పటికీ నిలబెట్టుకోవడం అరుదయినది. దాదాపు మూడున్నర దశాబ్దాల సుదీర్ఘ అధ్యాపక వ్యాపకంలో ఆయన పొందని పురస్కారం లేదంటే నమ్మరు.

వెనకబడిన కులాలు, ప్రాంతాల వాళ్ళకు చదువు రాదనీ, సంస్కృతి తెలియదనీ చేసిన వెక్కిరింతలను తన విద్వత్ తో సాధించిన విజయాలతో నోరు మూయించాడు. సౌడుతో మురికి బట్టలు ఉతికిన చేతులు విమానాలు తయారు చేయగలదని నిరూపించాడు. తన సుదీర్ఘ అధ్యాపక వ్యాపకంలో వేలాది అంతర్జాతీయ సదస్సులలో తన వివేకం తో వందలాది పరిశోధనా విద్యార్ధులకు మార్గదర్శకత్వం. ప్రపంచం వ్యాప్తంగా వందలాది విద్యార్దులకు తమ పరిశోధనలో భాగం అయ్యాడు.

‘మానవీయ,శాస్త్ర సాంకేతిక శాస్త్రాలలో ప్రపంచ వ్యాప్తంగా శూద్ర స్వీయ అనుభవవాదం ఆధిపత్య అగ్రవర్ణ తత్వ అన్వయింపు’ అనే వైరుధ్యం ఉంది. ఇంతకాలం క్షేత్ర స్థాయిలో స్వీయ అనుభవ వాదంతో అపారమైన జ్ఞాన చింతన కలిగినా అంతిమంగా అది ఆధిపత్య కులాలకూ శక్తులకూ వనరుగా మారింది ఇదో విషాదం. ఇది దాదాపు రెండు వందల ఏళ్ళుగా క్షేత్ర స్థాయిలో వివిధ విశ్వవిధ్యాలయాల లో పునరావృతం అవుతూనే ఉంది. కానీ మామిడాల రాములు స్వీయ అనుభవంతో చేసిన అన్వయింపు ఫలాలు ఆయనకూ ప్రపంచానికీ ఉపయోగాపడ్డాయి. బహుశా మామిడాల ఇక్కడే ఉండి ఉంటే ఒక సాధారణ మెకానికల్ ఇంజనీర్ గా కాసిన్ని పైసలు సంపాదించే వాడు. పదవీ విరమణ కూడా పొందేవాడు. కానీ ఆయన ఎన్నుకున్న కార్యక్షేత్రం తనదైన ముద్రను నిలిచేలా చేసింది.

తరాలుగా తన తాతలు తండ్రులు ఊరి మలినాన్ని చేతులతో ఎత్తి, గోడలకు సున్నాలు కొట్టి, భుజాల మీద దొరల పెళ్లిళ్ల మేనా మోసి, కవుసు పట్టిన గుడ్డలు ఉతికి, నాగరికతకు సబ్బును కనిపెట్టిన సామాజిక శాస్త్రవేత్తల వారసత్వం ఆయనది. ఊరికీ వాడకూ సంధాన కర్తవ్యం చేసిన బ్రతుకు వ్యధ ఇదొక పల్లెటూరి పసుల గాసే పోరడి కథ. ఇది ఒక తెలంగాణ జ్ఞానసంచారి అసామాన్యమైన ప్రయాణం, అసలు ఒక మనిషి ఇన్ని పనులు సాధ్యమేనా? బహుశా రాములు గారిని ఏదో తరిమి ఉంటాది. నీ జీవితానికి మిగిలింది ఈ ఒక్క రోజే నీకు ఇష్టమైన పనిచేసి చనిపో అని ఎవరన్నా ఆదేశిస్తే ఆ ఒక్క రోజు చేసే పనిని ఒక లెక్కగా తీసుకుంటే తన జీవితంలో ప్రతిరోజూ ఇదే చివరి రోజు అని మేధోశ్రమకే అంకితం అయిన ఒక అసమాన యాత్రికుని ప్రయాణం. వ్యవస్థీకృతమైన అసమ విలువలతో యుద్ధం చేసిన ఒక సామాన్య సామాజిక శాస్త్రవేత్త గెలుపు వెనక కన్నీటికథ. ఆయన మార్స్ అంత ఎత్తులో ఉన్నా ఎట్టి గాయాలనూ మట్టి వాసనలనూ మరవని అరుదయిన మనిషి. ఆకలినీ, అవనినీ, అవమానాలనూ తన ప్రతిభతో జయించాడు. జాతిరత్నంగా మిగిలిన ఆయనను గుర్తించని ఈ దేశ దౌర్భాగ్యానికి సిగ్గుపడుతూ ఇది కొన్ని తరాలు యాది చేసుకోవాల్సిన సందర్భం.

(హైదరాబాద్ సెమినార్ లో ఆయన చేసిన ప్రసంగం సందర్భంగా)

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు