దేశంలోనే మొదటి, ప్రతిష్ఠాత్మక ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు తుది ఎలైన్‌మెంట్ ఖరారైంది. 392 కిలోమీటర్ల పొడవున రాష్ట్రంలోని 8 జిల్లాలు, 14 మండలాలను కలుపుతూ చేపట్టాలని దక్షిణ మధ్య రైల్వే సూత్రప్రాయంగా నిర్ణయించింది. మొత్తం నిర్మాణానికి రూ.12,070 కోట్లవుతాయని అంచనా ఉండగా, రీజినల్ రింగ్ రోడ్డుకు సమాంతరంగా రింగ్ రైలు ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. ఈ ప్రాజెక్టుతో రవాణా సేవల్లో మల్టీ మోడల్ కనెక్టివిటీ పెరగనుండగా, కాలుష్య ఉద్గారాలు తగ్గనున్నాయి.
392 కిలోమీటర్ల పొడవుతో ఈ ప్రాజెక్టు రానుంది. రాష్ట్రంలో 8 జిల్లాలు, 14 మండలాలను కలుపుతూ రింగ్ రైలు ప్రాజెక్టు చేపట్టాలని దక్షిణ మధ్య రైల్వే సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ మార్గంలో నూతనంగా 26 రైల్వే స్టేషన్లు రానుండగా, మొత్తం నిర్మాణానికి రూ.12,070 కోట్లు అవుతుందని అంచనాగా నిర్ధారించారు. మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్గొండ, యాదాద్రి-భువనగిరి, సిద్దిపేట జిల్లాల పరిధిలో రింగ్ రైలు మార్గం రానుంది. ఆలేరు, వలిగొండ, గుళ్లగూడ, మాసాయిపేట, గజ్వేల్ మీదుగా ఔటర్ రింగ్ రైలు ఎలైన్‌మెంట్‌ను ఖరారు చేశారు.
హైదరాబాద్ చుట్టూ 361 కిలోమీటర్ల మేర ఆర్ఆర్ఆర్ రానుంది. దానికి 3 నుంచి 5 కిలోమీటర్ల దూరంలోనే వచ్చేలా ఔటర్ రింగ్ రైలు ఎలైన్‌మెంట్‌ను ఖరారు చేశారు. రెండుచోట్ల మాత్రం 11 కిలోమీటర్ల దూరం ఉండనుంది. ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టులో 6 చోట్ల ‘రైల్ ఓవర్ రైల్’ (ఆర్ఓఆర్) వంతెనలు రానున్నాయి. కొత్త లైన్‌ను ఎత్తుగా ఫ్లైఓవర్‌లో నిర్మిస్తారు. మాసాయిపేట, గుళ్లగూడ, బూర్గుల, వలిగొండ, వంగపల్లి, గజ్వేల్‌ను ఆర్ఓఆర్ ప్రాంతాలుగా ప్రతిపాదించారు.