పెహల్గాం మారణకాండ నేపథ్యంలో కాశ్మీర్ లోయలో ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. 2025 ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పెహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 నుండి 30 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణ ఘటనను ఖండిస్తూ, బాధితుల పట్ల సంఘీభావం తెలపడానికి శ్రీనగర్‌తో సహా కాశ్మీర్ లోయలోని పలు ప్రాంతాల్లో 2025 ఏప్రిల్ 23న స్వచ్ఛంద బంద్ జరిగింది. “This is an attack on all of us” వంటి ప్లకార్డులు పట్టుకుని ప్రదర్శనలు నిర్వహించారు. ఈ బంద్‌ను వివిధ సంస్థలు పిలుపునిచ్చాయి. ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత గత ఆరేళ్లలో కాశ్మీర్‌లో ఇది మొదటి బంద్‌గా నమోదైంది. అంతేకాదు ఉగ్రవాదంకి వ్యతిరేకంగా కాశ్మీరీలు స్వచ్ఛందంగా బంద్ పాటించడం ఇదే తొలిసారి.
ఈ బంద్‌కు రాజకీయ, సామాజిక, వాణిజ్య సంస్థలు మద్దతు ప్రకటించాయి. జమ్మూ ప్రాంతంలో కూడా వ్యాపార సంస్థలు మూతపడ్డాయి, విద్యాసంస్థలు మూసివేయబడ్డాయి, రోడ్లపై ట్రాఫిక్ నిలిచిపోయింది .
స్థానికులు ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. పెహల్గాం దాడిని కాశ్మీర్ ఆర్ధిక మూలాల్ని దెబ్బకొట్టే కుట్రగా పలువురు కాశ్మీరీలు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. కాశ్మీరీ ప్రాజలు ఉగ్రవాదానికి ఎల్లప్పుడూ వ్యతిరేకమేనని చెప్పారు. గందరగోళం మధ్యలో చిక్కుకున్న పర్యాటకులకు ఉచిత ట్యాక్సీ, ఆటో సేవలు, ఆశ్రయం కల్పించడం ద్వారా ఉదారతను చాటుకున్నారు.
పహల్గాం దాడికి “కశ్మీర్ రెసిస్టెన్స్” అనే ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించింది. ఈ సంఘటన తర్వాత భారత ప్రభుత్వం పాకిస్తాన్‌తో ఉన్న డిప్లొమాటిక్ సంబంధాలను తగ్గించింది, ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేసింది, ప్రధాన భూభాగ సరిహద్దును మూసివేసింది .