హైదరాబాద్: ‘నాలుగు వేల పెండింగ్ చలానా కోసం నా కారునే ఆపుతావా’ అంటూ ట్రాఫిక్ పోలీసులపై ఓ కారు ఓనర్ చిందులేశారు. ఎర్రమంజిల్ చౌరస్తాలో గురువారం సాయంత్రం పంజాగుట్ట ట్రాఫిక్ పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. అదే సమయంలో షేక్‌పేటకు చెందిన ఆరిఫ్ తార్ వాహనంలో ఖైరతాబాద్ వైపు నుంచి బంజారాహిల్స్ వైపు వెళ్తున్నాడు.
అన్ని వాహనాలను ఆపి పెండింగ్ చలానాలు తనిఖీ చేస్తున్న ట్రాఫిక్ ఎస్‌ఐ మోజీరాం తార్ వాహనాన్ని కూడా ఆపి తనిఖీ చేసి రూ. 4వేల వరకు చలానాలు పెండింగ్ ఉన్నట్లు గుర్తించారు. పెండింగ్ చలానాలు కట్టాలని పోలీసులు ఆరి్‌ఫకు సూచించారు. దీంతో రెచ్చిపోయిన ఆరిఫ్ ‘నాలుగు వేల రూపాయల పెండింగ్ చలానా కోసం నా కారు ఆపడానికి మీకు ఎన్ని గుండెలు.. నా ఇంట్లో కారుకు రూ.16వేల పెండింగ్ చలానా ఉంది.. ఎవరూ అడగలేదు.. నన్నే ఆపుతావా.. నగదు రెండు నిమిషాల్లో ట్రాన్స్‌ఫర్ చేయిస్తా’ అంటూ ట్రాఫిక్ పోలీసుల మీద చిందులేశాడు.
దీంతో ఖైరతాబాద్-పంజాగుట్ట మార్గంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్ సిబ్బంది కారు ముందు టైరుకు వీల్ క్లాంప్ వేశారు. చలానా డబ్బులు చెల్లించిన తర్వాతే వాహనాన్ని తీసుకెళ్లాలని అతనికి సూచించారు. అదే సమయంలో వీవీఐపీ మూవ్‌మెంట్ ఉండడంతో పోలీసులు వాహనాన్ని పంజాగుట్ట ట్రాఫిక్ పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. పోలీసులు పంజాగుట్ట శాంతిభద్రతల విభాగం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. చివరికి ఆరిఫ్ పెండింగ్ చలానాలు చెల్లించినట్టు తెలిసింది.