ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు సినిమా రంగానికి పరిశ్రమ హోదా కల్పించి, అభివృద్ధి చేయాలని, ఈ రంగంలో ఉన్నవారి గౌరవమర్యాదలకు భంగం వాటిల్లకుండా చూస్తుంటే, తెలుగు సినీ రంగంలో ఉన్నవారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్ల కనీస మర్యాద, కృతజ్ఞత కనిపించడం లేదని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో టీడీపీ సారథ్యంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును తెలుగు సినిమా సంఘాలు కనీసం ఒకసారి కూడా మర్యాదపూర్వకంగా కలిశారా అని ప్రశ్నించారు. కేవలం తమ చిత్రాల విడుదల సందర్భంలో ప్రభుత్వం ముందుకు రావడం మినహా, చిత్ర రంగం అభివృద్ధి కోసం సంఘటితంగా రాలేదని, అందరూ కలసి రావాలి తాను సూచించినా సానుకూలంగా స్పందించలేదని పేర్కొన్నారు. ఈ మేరకు ఏపీ ఉప ముఖ్యమంత్రి కార్యాలయం శనివారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది.
తెలుగు సినిమా రంగంలోని అగ్ర నటులను, సాంకేతిక నిపుణులను గత ప్రభుత్వం ఏ విధంగా ఛీత్కరించుకొని ఇక్కట్ల పాల్జేసిందో తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, నిర్మాతల మండలి, మూవీ ఆరిస్ట్స్ అసోసియేషన్ లాంటి సంఘాలు మరచిపోయినట్లున్నాయి. రూ.కోట్ల రూపాయల పెట్టుబడులతో రూపొందే చిత్రాలకు అన్ని విధాలా ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు, సృజనాత్మకత ముడిపడిన ఈ వ్యాపారంలో ఉన్నవారి గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకూడదు అని కూటమి పార్టీలు ఎన్నికలకు ముందు కూడా స్పష్టంగా చెప్పాయి.
గత ప్రభుత్వం వ్యక్తులను చూసి పనులు చేసేది. కక్ష సాధింపులకు దిగేది. తమకు నచ్చనివారి సినిమాల విడుదల సమయంలో తహసీల్దార్లను థియేటర్ల దగ్గర నియమించి ఎన్ని ఇబ్బందులుపెట్టిందో నిర్మాతలు మరచిపోతే ఎలా? ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ చెప్పిన విధంగానే – కూటమి ప్రభుత్వం వ్యక్తులను చూడలేదు. అక్కినేని నాగార్జున కుటుంబానికి చెందినవారి చిత్రం విడుదలైనప్పుడు సైతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగిన విధంగా ప్రోత్సహించింది. వ్యవస్థ బాగుండాలి, దానిపై ఆధారపడ్డవారు ఇబ్బందిపడకూడదు అనేదే కూటమి ప్రభుత్వ విధానం.