వింబుల్డన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను పోలండ్ అమ్మాయి ఇగా స్వియాటెక్ కైవసం చేసుకుంది. మట్టికోర్టు (ఫ్రెంచ్ ఓపెన్) మహారాణిగా గుర్తింపు పొందిన ఇగా.. పచ్చికలోనూ పాగా వేస్తూ తన తొలి, కెరీర్‌లో ఆరో గ్రాండ్‌స్లామ్‌ను గెలుచుకుంది. శనివారం ఇక్కడ జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్‌లో స్వియాటెక్.. 6-0, 6-0తో అమాండ అనిసిమొవ (యూఎస్)పై పూర్తి ఏకపక్ష విజయం సాధించింది. ఏడాదికాలంగా తనకు అచ్చొచ్చిన ఫ్రెంచ్ ఓపెన్‌తో పాటు ఇతర మేజర్ టోర్నీల్లోనూ నిరాశజనక ప్రదర్శనలు చేస్తున్న పోలండ్ బామ.. ఈ ఏడాది ఫస్ట్ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను గెలిచింది. 57 నిమిషాల్లోనే ముగిసిన ఫైనల్‌లో స్వియాటెక్ జోరు ముందు అమాండ తేలిపోయింది.
ఆరంభం నుంచే తనదైన దూకుడుతో చెలరేగిపోయిన స్వియాటెక్.. 114 ఏండ్లలో ప్రత్యర్థికి ఒక్క పాయింట్ కూడా దక్కకుండా చేసి రికార్డు విజయం సాధించింది. కోర్టులో పాదరసంలా కదిలిన ఇగా.. తొలి సెట్‌ను 22 నిమిషాల్లోనే ముగించింది. బలమైన ఫోర్‌హ్యాండ్ షాట్లతో ప్రత్యర్థిపై సునామీలా విరుచుకపడ్డ ఆమె.. అమాండకు కోలుకునే అవకాశమే ఇవ్వలేదు. సెమీస్‌లో సబలెంకా వంటి బలమైన ప్రత్యర్థిని ఓడించిన అమాండ.. ఫైనల్‌లో కనీసం ప్రతిఘటన కూడా చూపలేదు. 2015, 2016లో సెరెనా విలియమ్స్ బ్యాక్ టు బ్యాక్ టైటిల్స్ గెలిచిన తర్వాత వింబుల్డన్ (ఉమెన్ సింగిల్స్)లో కొత్త చాంపియన్ అవతరించడం ఇది ఏకంగా 8వ సారి కావడం విశేషం.