రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జులై 12, 2025న భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 80(1)(a) కింద నలుగురు ప్రముఖ వ్యక్తులను రాజ్యసభకు నామినేట్ చేశారు. ఈ నామినేషన్లు గతంలో నామినేట్ చేయబడిన సభ్యుల రిటైర్మెంట్ వల్ల ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయడానికి జరిగాయి. నామినేట్ చేయబడిన వ్యక్తులు:
ఉజ్వల్ నికం: 26/11 ముంబై ఉగ్రవాద దాడులతో సహా అనేక కీలక క్రిమినల్ కేసులను వాధించిన ప్రముఖ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఆయనకు పేరుంది. 2024 సార్వత్రిక ఎన్నికలలో నికంను ముంబై నార్త్ సెంట్రల్ లోక్సభ నియోజకవర్గం నుంచి బీజేపీ పోటీకి దింపింది. అయితే, ఆయన కాంగ్రెస్ అభ్యర్థి వర్ష గైక్వాడ్ చేతిలో ఓటమిని ఎదుర్కొన్నారు.
సి సదానందన్ మాస్టర్: కేరళకు చెందిన ఉపాధ్యాయుడు, సామాజిక కార్యకర్త అయిన సదానందన్ దశాబ్దాలుగా అట్టడుగు వర్గాలకు సేవలందిస్తున్నారు. చాలా కాలంగా బీజేపీతో అనుబంధం కలిగి ఉన్నారు. ఆయన 2021 కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. 1994లో సీపీఐ(ఎం) కేడర్ పెరిన్చేరి గ్రామ సమీపంలో తనపై దాడి చేసి తన రెండు కాళ్లను నరికివేసిన క్రూరమైన రాజకీయ దాడితో ఆయన పేరు ప్రముఖంగా వినిపింది.
హర్ష్ వర్ధన్ ష్రింగ్లా: ఈయన అమెరికా, బంగ్లాదేశ్, థాయిలాండ్లకు రాయబారి సహా కీలక దౌత్య పదవులను నిర్వహించారు. భారత మాజీ విదేశాంగ కార్యదర్శి, కీలకమైన అంతర్జాతీయ విధులు నిర్వహించిన దౌత్యవేత్త. 2023లో భారత జీ20 ప్రెసిడెన్సీకి ఆయన చీఫ్ కోఆర్డినేటర్గా కూడా పనిచేశారు.
మీనాక్షి జైన్: ఈ జాబితాలో ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని గార్గి కాలేజీలో మాజీ అసోసియేట్ ప్రొఫెసర్, ప్రముఖ చరిత్రకారిణి, హిస్టోరియన్ డాక్టర్ మీనాక్షి జైన్ కూడా ఉన్నారు. భారత చరిత్రకు సంబంధించి జైన్ చేసిన కృషి, విద్యారంగంలో ఆమె చేసిన కృషికి గుర్తింపు పొందారు.
ఈ నామినేషన్లు సాహిత్యం, విజ్ఞానం, కళ, సామాజిక సేవలలో ప్రత్యేక జ్ఞానం లేదా అనుభవం ఉన్న వ్యక్తులను ఎంపిక చేయడానికి రాష్ట్రపతికి రాజ్యాంగం అధికారం ఇస్తుంది. ఈ నలుగురి నామినేషన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాగతించారు, వారి రంగాల్లో వారి సహకారాన్ని ప్రశంసిస్తూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ నామినేషన్లు రాజ్యసభలో విభిన్న నైపుణ్యాలు, అనుభవాలతో కూడిన ప్రాతినిధ్యాన్ని నిర్ధారించడానికి ఉద్దేశించినవి, పార్లమెంటు సమావేశాలను సమర్థవంతంగా పని చేయటానికి తోడ్పడతాయి.