ఎండాకాలం మొదలవడంతో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. బయటకు వెళ్తేచాలు ఎండ వేడితో ప్రజలు వడదెబ్బకు గురవుతున్నారు. మధ్యాహ్నమే మాత్రమే కాదు సాయంత్రం కూడా ఎండ తగ్గడంలేదు. మార్చి మొదటివారం నుంచే రికార్డు స్థాయిల్లో ఉష్ణోగ్రత నమోదవుతోంది. మార్చిలోనే పరిస్థితి ఇలా ఉంటే పోను పోను ఎండలు ఇంకెంతగా ఉంటాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోతున్నాయి. మార్చిలోనే 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణంకంటే 3.3 డిగ్రీల ఉష్ణోగ్రత ఎక్కువ నమోదవుతోంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండల తీవ్రత బాగా పెరిగిపోయింది. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. సుమారుగా 42 డిగ్రీలకు పైగా నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఆదిలాబాద్, కొమురంభీం, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో ఎండ తీవ్రతలు పెరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఎండ తీవ్రతతో పాటు వడగాలుల ప్రభావం కూడా అధికంగా ఉండే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఈ జిల్లాల్లో ఇప్పటికే ఉష్ణోగ్రతలు మరింతగా పెరగడంతో ఎల్లో అలర్ట్ జారీ చేశామని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. శనివారం గరిష్ట ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెబుతున్నారు.
ఎండల తీవ్రత తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, దేశవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా కేరళలో అతినీలలోహిత కిరణాలు తీవ్రరూపం దాల్చాయని చెప్పారు. వాతావరణ కాలుష్యం, ఓజోన్ పొరకు రంధ్రాలు, తదితర కారణాలతో అతినీలలోహిత కిరణాలు అత్యంత ప్రమాదకర విభాగంలోకి చేరాయి. దీంతో కేరళలోని ఆయా జిల్లాల్లో ఆ రాష్ట్ర విపత్తుశాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. అతినీలలోహిత కిరణాలు ప్రమాదపు కేటగిరిలో ఉండటంతో కేరళ రాష్ట్రప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పలు ప్రాంతాల్లో యూవీ కిరణాలు 11 పాయింట్లుగా రికార్డు అయింది. యూవీ కిరణాలు 11 పాయింట్లు దాటితే అతి ప్రమాదంలో ఉన్నట్లే!