కర్రెగుట్టల ప్రాంతం ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్తతతో ఉంది. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని ఈ ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టులపై భారీ కూంబింగ్ ఆపరేషన్‌ను చేపట్టాయి. ఈ ఆపరేషన్‌లో ఇప్పటివరకు 38 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం.
వరుసగా ఐదో రోజు కూడా భద్రతా బలగాలు 44 డిగ్రీల ఉష్ణోగ్రతలో ”బ్లాక్ హిల్ల్శ్గా పేరొందిన కర్రెగుట్టల్లో కూంబింగ్ నిర్వహించాయి. సాయంత్రం నాలుగు గంటలకే చీకటిపడటం, ఐదు అడుగుల దూరంలోని మనిషి కూడా కనిపించని పరిస్థితులు వుండటంతో మావోయిస్టులు కర్రెగుట్టల్ని అత్యంత సురక్షితమైన ప్రాంతంగా భావిస్తారు. 90 కిలోమీటర్ల పొడవున్న కర్రెగుట్టల్ని తమ అధీనంలోకి తెచ్చుకునేందుకు వేలాదిమందితో కూడిన సాయిధ బలగాలు ఈ ప్రాంతాన్ని జల్లెడ పడుతూ కొండ పైకి చేరుకునే ప్రయత్నం చేస్తున్నాయి. శనివారం సాయంత్రం నాటికి అతి కష్టం మీద కొంతమేరకు కొండ పైకి ఎక్కిన సాయుధ బలగాలు మావోయిస్టులు తలదాచుకున్నట్లుగా భావిస్తున్న సొరంగాన్ని గుర్తించాయి.
మావోయిస్టులు ఈ ప్రాంతంలో పేలుడు పదార్థాలు అమర్చినట్లు ప్రకటించడంతో, భద్రతా బలగాలు డ్రోన్లు, హెలికాఫ్టర్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ ప్రాంతంలో మావోయిస్టు సుప్రీం కమాండర్ హిడ్మా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కర్రెగుట్టల చుట్టూ ఉన్న గ్రామాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. స్థానికులు ఇళ్లలోనే ఉండాలని భద్రతా బలగాలు సూచించాయి. పౌర హక్కుల సంఘాలు ఈ కాల్పులను ఖండిస్తూ, మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఈ ఆపరేషన్‌లో భాగంగా, భద్రతా బలగాలు కర్రెగుట్టల ప్రాంతాన్ని పూర్తిగా మోహరించి, మావోయిస్టుల ఉనికిని నిరోధించేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. ఇది దేశంలో మావోయిస్టులపై జరుగుతున్న అతిపెద్ద ఆపరేషన్లలో ఒకటిగా భావిస్తున్నారు.