షెఫాలీ జరీవాలా, ‘కాంటా లగా’ సాంగ్ ఫేమ్ నటి, 2025 జూన్ 27న 42 సంవత్సరాల వయస్సులో ముంబైలో మరణించారు. ఆమె మరణానికి కారణం గుండెపోటు (కార్డియాక్ అరెస్ట్) అని మొదట వార్తలు వచ్చినప్పటికీ, ముంబై పోలీసులు ఈ మరణాన్ని అనుమానాస్పదంగా భావించి దర్యాప్తు చేస్తున్నారు. శుక్రవారం రాత్రి 11:15 గంటల సమయంలో ఆమెను ముంబైలోని బెల్లేవ్యూ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రికి తీసుకెళ్లగా, అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.
సోషల్ మీడియాలో పలువురు ఆమె మరణానికి యాంటీ-ఏజింగ్ ఇంజెక్షన్ కారణమై ఉండవచ్చని భావించారు. శుక్రవారం నాడు ఆమె ఇంట్లో పూజాదికాలు వున్నందున ఆమె ఉపవాసంలో వున్నారు. ఖాళీ కడుపు మీద యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్ తీసుకున్న కారణంగా అది వికటించిందని వార్తలు వస్తున్నాయి. కానీ ఇది అధికారికంగా ధృవీకరించబడలేదు. పోస్ట్మార్టం నివేదిక ఇంకా వెల్లడి కానందున, ఖచ్చితమైన మరణ కారణం తెలియాల్సి ఉంది. పోలీసులు ఆమె అపార్ట్మెంట్లో ఫోరెన్సిక్ తనిఖీలు చేస్తున్నారు. ఇంట్లో పనిచేసే వారిని ప్రశ్నిస్తున్నారు. షెఫాలీ భర్త పరాగ్ త్యాగీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.