పాకిస్థాన్‌తో జరిగే ఎలాంటి క్రీడా పోటీల్లో పాల్గొనకూడదని భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు ద్వైపాక్షిక పోటీలో భాగంగా పాకిస్థాన్ జట్టు భారత్‌కు వచ్చేందుకు అనుమతి ఇవ్వబోమని తేల్చి చెప్పింది. అయితే అంతర్జాతీయ టోర్నమెంట్లలో పాకిస్థాన్‌తో తలపడేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపింది. ఈ క్రమంలోనే త్వరలో జరగబోయే ఆసియా కప్‌లో భారత్‌ను ఆడకుండా అడ్డుకోబోమని కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ మేరకు భారత్- పాకిస్థాన్ అంతర్జాతీయ మ్యాచ్‌లపై కొత్త విధానాన్ని ప్రటించింది. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని వివరించింది. అయితే, ఒలింపిక్ ఛార్టర్ ప్రకారం అంతర్జాతీయ టోర్నమెంట్లలో పాకిస్థాన్‌తో తలపడేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపింది. ఇలాంటి టోర్నమెంట్లో భాగంగా పాకిస్థాన్‌లో పర్యటించేందుకు అనుమతి ఇస్తారా? అని ప్రశ్నించగా, అప్పటి పరిస్థితుల ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌తో సంబంధాలు తెంచుకోవాలన్న డిమాండ్లు పెద్ద ఎత్తున వచ్చాయి. దీంతో ఇటీవలే జరిగిన వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్‌లో కూడా భారత్- పాకిస్థాన్ మ్యాచ్‌ను జరగలేదు. ఈ పరిస్థితుల్లో ఆసియా కప్‌లో ఏమి జరుగుతుందన్న దానిపై క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే, తాజాగా కేంద్రం అంగీకారం తెలపడంతో భారత్- పాక్ మ్యాచ్ జరగనుంది. ఈ టోర్నీలో గ్రూప్ దశలో భారత్- పాకిస్థాన్ రెండు సార్లు తలపడే అవకాశం ఉంది. సెప్టెంబర్ 14, 21 తేదీ (గ్రూప్, సూపర్ 4 దశ)ల్లో భారత్-పాక్ మ్యాచ్ ఆడనుంది. అంతేకాకుండా నాకౌట్ దశలోనూ మరోసారి ఇరుజట్లు పోటీపడే ఛాన్స్ కూడా ఉంది. ఫలితంగా ఇరు జట్లు మూడు సార్లు ఆడే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌లు అన్నింటికీ దుబాయ్ స్టేడియం వేదిక కానుంది.