భారత మాజీ క్రికెటర్ మరియు మాజీ ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ రాజస్థాన్ రాయల్స్ ప్రధాన కోచ్ పదవి నుంచి వైదొలిగారు. ఈ విషయాన్ని ఫ్రాంఛైజీ తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ప్రకటించింది, ద్రవిడ్ సేవలకు ధన్యవాదాలు తెలిపింది.
ద్రవిడ్ 2024లో టీమ్ ఇండియా టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత భారత జట్టు ప్రధాన కోచ్‌గా తన పదవీకాలం పూర్తి చేశారు. ఆ తర్వాత 2024లోనే రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టారు. గత ఐపీఎల్ సీజన్‌లో కాలికి గాయం కావడంతో కట్టుతో జట్టుతో ప్రయాణించిన వీడియోలు వైరల్ అయ్యాయి. రాజస్థాన్ రాయల్స్‌తో ద్రవిడ్‌కు గతంలో గొప్ప అనుబంధం ఉంది. ఆయన ఈ జట్టుకు కెప్టెన్‌గా, మెంటార్‌గా కూడా పనిచేశారు.
ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు ద్రవిడ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫ్రాంఛైజీలో ఆయన ప్రభావం గణనీయంగా ఉందని, అద్భుతమైన సంప్రదాయాన్ని నెలకొల్పడంలో కీలక పాత్ర పోషించారని రాజస్థాన్ రాయల్స్ పేర్కొంది. మరింత ఉన్నతమైన పాత్ర ఇస్తామని ఆఫర్ చేసినప్పటికీ, ద్రవిడ్ తిరస్కరించారు. ఈ నిర్ణయం వెనుక కారణాలు స్పష్టంగా తెలియలేదు.