తెలంగాణలో ప్రభుత్వ సర్వీసుల నుంచి రిటైర్ అయిన తర్వాత, కాంట్రాక్టు ఉద్యోగాలు చేస్తున్న 6729 మందికి ఉద్వాసన పలకాలని ముఖ్యమంత్రి ఆదేశాలతో CS ఉత్తర్వులు జారీచేశారు. మునిసిపల్ శాఖలో ఉద్యోగుల్ని తొలగించడంతో విద్యుత్తుశాఖలో మరికొందరు డైరెక్టర్లను తొలగించనున్నారు. ఇరిగేషన్ శాఖలో ఇప్పటికే 200 మందికి పైగా ఉద్యోగులను తొలగించారు. రెవెన్యూ, దేవాదాయం, R&B, విద్యాశాఖ, BC సంక్షేమం, రవాణా, ఎక్సైజ్, వాణిజ్య పన్నులు సహా అన్ని శాఖలు ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ఉత్తర్వులు జారీ చేయనున్నారు.
జాబితాలో మెట్రోరైల్ MD NVS రెడ్డి, యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి ప్రాధికార సంస్థ(YTDA) వైస్ చైర్మన్ G.కిషన్‌రావు, కన్సల్టెంట్ ఇంజినీరు BLN రెడ్డి, పదిమంది ట్రాన్స్‌కో, జెన్‌కో డైరెక్టర్లున్నారు. వీరి స్థానంలో కొత్త ఉద్యోగ నియామకాలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ ఆలోచనగా తెలుస్తోంది. ఇప్పుడు ఈ నిర్ణయం ప్రభుత్వంలో సంచలనంగా మారింది.
ప్రభుత్వ నిర్ణయంతో కీలక శాఖలుగా ఉన్న రెవెన్యూ, దేవాదాయం, R&B, విద్యాశాఖ, BC సంక్షేమం, రవాణా, ఎక్సైజ్, వాణిజ్య పన్నులు ఇలా పలు కీలకశాఖల ముఖ్యఅధికారులు సైతం శాఖల వారీగా ఉత్తర్వులు జారీ చేసేందుకు కసరత్తు జరుగుతోంది. కాగా, తొలగించిన వారిలో తిరిగి సేవలు అవసరమని భావిస్తే నోటిఫికేషన్ ద్వారా నియామాలు చేపట్టాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే మెట్రో రైల్ ప్రాజెక్టును ముందు నుంచి పర్యవేక్షిస్తున్న NVS రెడ్డికి తిరిగి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
ఈ నిర్ణయం ద్వారా కొత్తగా నియామకాలను అవకాశం ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు. గ్రూపు -1 నుంచి గ్రూపు-4 వరకు కొత్త నోటిఫికేషన్ల ద్వారా కొత్తవారికి అవకాశం దక్కుతుందని చెబుతున్నారు. ఉద్యోగుల ప్రమోషన్లకు అవకాశం ఏర్పడుతుంది అనే చర్చ సాగుతోంది. దీంతో ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం ఉద్యోగ వర్గాల్లో ఆసక్తికరంగా మారుతోంది.