ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ బృందం జపాన్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. పర్యటనలో భాగంగా తొలి రోజునే భారీ పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి. జపాన్‌కు చెందిన ప్రముఖ వ్యాపార సంస్థ Marubeni తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో అత్యాధునిక పారిశ్రామిక పార్క్‌ను ఏర్పాటు చేయడానికి Marubeni రెడీ అయింది. టోక్యోలో మరుబెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు.
Marubeni సంస్థ దాదాపు రూ. 1,000 కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్టును మొదలు పెట్టనుంది. ఫ్యూచర్ సిటీలో 600 ఎకరాల్లో ఈ పార్క్‌ను అభివృద్ధి చేస్తారు. దీనికి సంబంధించిన ఒప్పందంపై లెటర్ అఫ్ ఇంటెంట్ ముఖ్యమంత్రి సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, Marubeni ప్రతినిధులు సంతకాలు చేశారు. ఈ ఇండస్ట్రియల్ పార్క్‌లో జపాన్, ఇతర దేశాల కంపెనీలు తమ తయారీ యూనిట్లను ఏర్పాటు చేస్తాయి. దీని ద్వారా దాదాపు రూ. 5,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నారు. Marubeni ఇండస్ట్రియల్ పార్క్ ప్రధానంగా ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఫార్మా, ప్రెసిషన్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలపై దృష్టి పెడుతుంది.
కాగా, Marubeni ప్రపంచవ్యాప్తంగా 65 దేశాలలో 410కి పైగా గ్రూప్ కంపెనీల ద్వారా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఆహారం, వ్యవసాయ ఉత్పత్తులు, లోహాలు, గనులు, ఇంధనం, విద్యుత్, కెమికల్స్, మౌలిక సదుపాయాలు, ఫైనాన్స్ లీజింగ్, రియల్ ఎస్టేట్, ఏరోస్పేస్, మొబిలిటీ వంటి రంగాలలో ఈ కంపెనీ అగ్రగామిగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 50,000 మంది ఉద్యోగులను నియమించుకుంది.