నాలుగేళ్ల క్రితం సంచలనం సృష్టించిన వామనరావు–నాగమణి న్యాయవాద దంపతుల హత్య కేసులో కీలక మలుపు తిరిగింది. సుప్రీంకోర్టు ఆదేశాల(Supreme Court orders) మేరకు ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) స్వీకరించింది. ఇప్పటికే ముగ్గురిని నిందితులుగా చేర్చుతూ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది.
ఎఫ్‌ఐఆర్‌లో ముగ్గురు నిందితులు: సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో వెల్ది వసంతరావు, కుంట శ్రీనివాస్, అక్కపాక కుమార్ పేర్లు ఉన్నాయి. దర్యాప్తు అధికారిగా విపిన్ గహలోత్ నియమితులయ్యారు. సీబీఐ ఈ కేసులో అన్ని కోణాలను లోతుగా పరిశీలించనుంది. 2021 ఫిబ్రవరి 17న పెద్దపల్లి జిల్లా కల్వచర్ల సమీపంలో వామనరావు, నాగమణి దంపతులను దుండగులు నడిరోడ్డుపై దారుణంగా హతమార్చారు. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. రాష్ట్ర పోలీసులు విచారణ(Inquiry) జరిపి కొందరు నిందితులను అరెస్టు చేసినప్పటికీ, బాధితుల కుటుంబం దర్యాప్తుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. వామనరావు తండ్రి గట్టు కిషన్‌రావు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో, కోర్టు గత ఆగస్టు 12న కేసును సీబీఐకి బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. తాజాగా సీబీఐ అధికారికంగా కేసు స్వీకరించడంతో దర్యాప్తు మళ్లీ పునఃప్రారంభమైంది.