రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల భారీ సంక్షేమ పథకాన్ని విజయవంతం చేయడంలో సిమెంటు, స్టీలు పరిశ్రమలు భాగస్వాములు కావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కోరారు. పరిశ్రమల మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి ఆయన సిమెంటు, స్టీలు పరిశ్రమల యజమానులు, అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. రూ.22,500 కోట్లతో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.
రాష్ట్రంలోని స్టీలు, సిమెంటు పరిశ్రమలను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నామని, మానవీయ కోణంలో ఆలోచించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి స్టీలు, సిమెంటు ధరలను తగ్గించి ఇవ్వాలని కోరారు. పెద్ద, చిన్న అనే అంతరం లేకుండా కంపెనీలన్నీ ఒకే ధరకు సిమెంటు, స్టీలును సరఫరా చేయాలన్నారు. ఏపీ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రభుత్వ పథకాలకు సిమెంటు కంపెనీలు అందిస్తున్న ధరను సమావేశంలో మంత్రులు సమీక్షించారు. 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సుమారు 50 లక్షల మెట్రిక్ టన్నుల సిమెంటు, 27.75 లక్షల మెట్రిక్ టన్నుల స్టీలు అవసరమవుతుందని అధికారులు పరిశ్రమల యజమానులకు వివరించారు. పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో వీలైనంత త్వరగా సమావేశమై ధరలను ఫైనల్ చేస్తామని స్టీలు, సిమెంటు పరిశ్రమల యాజమాన్యాల ప్రతినిధులు తెలిపారు.